సమస్యల ఒడిలో అంగన్‌వాడీలు

– నెలనెలా అందని వేతనాలు 
– గాడిద చాకిరీ చేసినా చీదరింపులు
– ధర్నా వీడియోలు చూపి ఉద్యోగం పీకేస్తామని బెదిరింపులు
– అమ్మకానికి అంగన్‌వాడీలు పోస్టులు 

ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తల బతుకులు కడు దయనీయంగా మారుతున్నాయి. ప్రభుత్వం తరఫున జరిగే అన్ని కార్యక్రమాలను ‘ముందుకు తీసుకుపోవడానికి’ వీరు కావాలి. కానీ వేతనాలు ఇచ్చేటప్పుడు సమస్యల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం వీరు ప్రభుత్వానికి గుర్తు రావడం లేదు. ప్రభుత్వం ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా దానిని ప్రచారం చేయాల్సింది వీరే. ఇంటింటికీ తిరిగి లెక్కలు తీయాలంటే అంగన్‌వాడీలు కావాలి. పోలియో చుక్కలు వేయాలంటే.. నగదు రహితం గురించి ప్రచారం కల్పించాలంటే వాళ్లే కావాలి. అలా అన్నింటా సర్కారుకు అండగా ఉన్న అంగన్‌వాడీల బతుకులు చంద్రబాబు హయంలో దారుణంగా ఉంటున్నాయి. 

వేతనాలు సకాలంలో అందవు
కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ఎంత కష్టపడినా కడుపు నింపుకోవడానికే. అయితే వారంలో ఏడు రోజులూ అంగన్‌వాడీలు పనిచేసినా వారికి సరైన కనీస వేతనాలు లేవు. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం వారి వేతనాలు ఏడు వేలకు పెరిగాయి. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం పెంచింది. కానీ ఈ వేతనాలు కూడా ప్రతినెలా ఎప్పటికప్పుడు అందవు. ఏ నాలుగు నెలలకు ఒకసారికానీ అందవు. అదీ ధర్నాలు, నిరసనలు జరిగితేనే. ఆ నిరసనల సందర్భంగా అంగన్‌వాడీలు ఎన్ని లాఠీ దెబ్బలు తినాలో.. ఎన్ని గుర్రాల కాళ్లతో తన్నులు తినాలో. ఇన్ని జరిగితేకానీ నెలకు ఏడు వేలు అందవు. అలాగని వారి పనులు వాళ్లను సాఫీగా చేసుకోనిస్తారా అంటే అదీ ఉండదు. ప్రభుత్వం చేసే ప్రతి అడ్డమైన కార్యక్రమానికి వీరినే ఉపయోగించుకుంటారు. కనీసం గుర్తింపు కూడా ఉండదు. 

అద్దె కొంపల్లో అంగన్‌వాడీలు
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఎక్కువ శాతం కొనసాగేది అద్దె భవనాల్లోనే. ఇప్పటికీ సొంత భవనాలుండవు. అద్దె కోసం యజమానులు వేధిస్తే అంగన్‌వాడీ కార్యకర్తలే చందాలేసుకుని అద్దె చెల్లించాలి. ఉదాహరణకు ఒక్క కర్నూలు జిల్లాలో సొంత భవనాలు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాలు 755 ఉండగా, 2,451 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం శిథిలావస్థకు చేరాయి. దీంతో చిన్నారులను కేంద్రాలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అద్దె గదుల్లోని కేంద్రాల్లో మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు లేక పిల్లలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి అన్ని సౌకర్యాలూ కలిగిన సొంత భవనం ఉండాలి. లేదా కనీసం మూడు గదులు ఉండే భవనాన్ని అద్దెకు తీసుకోవాలి. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడా 600 గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో కేంద్రాలు లేవు. కనీసం 50 గజాలు, గాలి, వెలుతురు కూడా సరిగా లేని ఇరుకు గదుల్లో చిన్నారులు మగ్గుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. గతేడాది కొత్త భవనాల ను నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్కడుగూ ముందుకు పడలేదు.

కేంద్రాల్లో మందుల్లేవు 
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటే ప్రథమచికిత్స అందించేందుకు గతంలో అవసరమైన ఆరోగ్య సామాగ్రిని పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా ప్రథమ చికిత్స పెట్టెలను సర్కారు సరఫరా చేయడం లేదు.

పాలల్లో లోపాలు 
నూతన టెక్నాలజీతో పాలను ఫ్రిజ్‌ లేకుండా 90 రోజుల పాటు నిల్వ ఉంచుకునే ప్యాకెట్లను ప్రభుత్వం కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.44 ఉంటుంది. ఈ పాల కోసం ఒక్కో మండలానికి రూ.3 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పాల ప్యాకెట్లు కేంద్రానికి వచ్చిన రెండు మూడు రోజులకే వాసన వస్తున్నాయని అంగన్‌వాడీ వర్కర్లు పేర్కొంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డలో చెడిపోయిన పాల విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారులకు కొందరు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

గుడ్లు మింగేస్తున్నారు.. 
పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీల చిన్నారులకు అందజేసే కోడిగుడ్లను సైతం టీడీపీ నాయకులు వదిలిపెట్టడం లేదు. గుడ్ల సరఫరాలో రూ.140 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. తమ వారికే టెండర్‌ దక్కేలా నిబంధనలను అమలు చేశారు. స్థానిక పౌల్ట్రీ ఫారాలకు అవకాశం ఇవ్వకుండా బడా వ్యాపారులకే గుడ్ల సరఫరా టెండర్‌ను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు ఇస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు 4,62,09,924, అంగన్‌వాడీలకు 4,40,87,533 గుడ్లు... మొత్తం 9,02,97,457 కోడిగుడ్ల సరఫరాకు ఈ ఏడాది జనవరి 27న  ప్రభుత్వం టెండర్‌ ప్రకటన విడుదల చేసింది.

ధర్నా చేస్తే ఉద్యోగం పీకేస్తారా 
అంగన్‌ వాడీ కార్యకర్తలపై టీడీపీ కన్నేసింది. ఊరూరా ఉండే వారితో రాజకీయ అవసరాలు తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే వారంతా సంఘటితంగా ఉండడంతో చీల్చే పని ప్రారంభించింది. నేరుగా నారా లోకేష్‌ సారథ్యంలో ఈ పని సాగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం మూకుమ్మడి తొలగింపులకు ప్రయత్నిస్తోంది. దానికి విజయవాడ ధర్నాను సాకుగా చూపుతోంది. ధర్నాలో పాల్గొన్న వారిని వీడియో ఫుటేజీల్లో గుర్తించి తొలగించేందుకు కసరత్తులు ప్రారంభించింది. అధికారం అడ్డుపెట్టుకుని మహిళలపై పగ తీర్చుకునేందుకు కూడా నారా బృందం వెనకాడటం లేదు. తాజాగా అంగన్‌వాడీ పోస్టులను కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో అంగన్‌వాడీ పోస్టును లక్షా రెండు లక్షలకు బేరం పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ బాగోతం నడుస్తోంది. 
Back to Top