28 నుంచి వైయస్‌ జగన్ సమైక్య శంఖారావం

హైదరాబాద్, 21 నవంబర్ 2013:

సమైక్యాంధ్ర సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28 నుంచి 'సమైక్య శంఖారావం' పూరిస్తూ బస్సు యాత్ర చేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీ జగన్‌ యాత్ర ప్రారంభమవుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్. అమర్నా‌థ్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమైక్య శంఖారావం యాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మూడు ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ అహంకారాన్ని నిలదీస్తూ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబడుతూ శ్రీ జగ‌న్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగుతుందని అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.

సమైక్య శంఖారావం యాత్రలో ఓదార్పు కుటుంబాలను కూడా శ్రీ జగన్ పరామర్శిస్తారని‌ ఆయన తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గడచిన సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి సమైక్య శంఖారావం బస్సు యాత్ర నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరుగుతుందని శ్రీ జగన్ పదేపదే ‌చెబున్నారని ఆయన అన్నారు. ఈ యాత్ర ద్వారా ఆయన ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తారన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకునేవారు తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసి రాష్ట్ర విభజన‌ కోసం కేంద్రానికి గండ్రగొడ్డలి ఇచ్చాయని అమర్నా‌థ్‌రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబుకు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని మరో తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమా‌ర్ రెడ్డి విమర్శించారు. సోనియాగాంధీతో మాట్లాడేందుకు ఇటలీ భాష నేర్చుకున్న చంద్రబాబు సమైక్యం అనే తెలుగు మాటను అనకపోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబును చూసి చిత్తూరు జిల్లా ప్రజలు కచ్చితంగా తలవంచుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీని కాపాడేందుకు రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, కె. నారాయణ స్వామి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top