మా ప్ర‌శ్న‌ల‌కు బ‌దులుందా బాబూ?


- రాజ‌ధాని బాండ్ల వ్య‌వ‌హారంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ 9 ప్ర‌శ్న‌లు
- చంద్ర‌బాబు వివ‌ర‌ణ‌, కుటుంబ‌రావు ప్రెస్‌మీట్‌పై పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి సుదీర్ఘ లేఖ‌
- కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్ట‌డం భావ్య‌మేనా?

 హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాజధాని బాండ్లకు సంబంధించి ప్రభుత్వ వివరణల్లో డొల్లతనం బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ పేర్కొన్నారు . రాజధాని నిర్మాణానికి అంటూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులకు
సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్  పార్టీ తరఫున  కొన్ని సందేహాలు లేవనెత్తుతూ మూడు రోజుల క్రితం ప్రెస్‌ మీట్‌
పెట్టిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఆర్‌డీఏ వివరణ, కుటుంబరావు  మీడియా ఇంటరాక్టివ్‌ల ద్వారా ప్రభుత్వం చేసిన వాదనలు చూసిన తరవాత వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు కూడా సీఆర్‌డీయే వివరణ ఇచ్చింది. ఈ రెండూ చూసిన తరవాత... ప్రజల తరఫున మేం అడుగుతున్న మౌలిక అంశాలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నందున ఈ క్రింది అంశాలను మీడియా ద్వారా ప్రజల దృష్టికి
తీసుకువస్తున్నామ‌న్నారు.

ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులుందా బాబూ..?
1) రాజధాని బాండ్ల విషయంలో వడ్డీ రేటు 10.5 శాతం కాదు... 10.32 అంటూ సీఆర్‌డీయే ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఉంది. 10.5కు 10.32కు చాలా తేడా ఉన్నదని చెప్పేందుకు ఆ వివరణలో ప్రయత్నించారు. మేం ప్రశ్నిస్తున్నది అసలు 10.32 శాతానికి ఎందుకు ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సి వచ్చిందన్నది. అది కూడా బాండ్ల రూపంలో ఎందుకు సేకరించారన్నది. ఆ బాండ్లకు కూడా ప్రజల నుంచి పిండి ప్రభుత్వాలు కట్టాల్సిన వడ్డీ, అదీ మూడు నెలలకు ఒకసారి చెల్లించటం ద్వారా మొత్తంగా 10.7 శాతం కంటే మించుతుందన్నది వాస్తవమా? కాదా?  

2) మీరు బాండ్ల రూపంలో సేకరించిన రూ.2000 కోట్లు ఆరో సంవత్సరం నుంచి వెనక్కు ఇవ్వటం ప్రారంభిస్తే, మీరు అనుమతించిన విధంగా ఒక వేళ 20 శాతం చొప్పున వెనక్కు తీసుకుంటాం అని పెట్టుబడి దార్లు అడిగితే, అసలుగానే సంవత్సరానికి రూ.400 కోట్లు ఇవ్వాల్సిందే కదా? మొత్తం ఎంతమంది పెట్టుబడి పెట్టారో అందరూ కూడా తమ 20 శాతం వెనక్కు ఇవ్వండి అని అడగవచ్చు కదా? ఇది నిజమా కాదా?

3) ముంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజికి కమీషన్‌ ఇవ్వలేదని నిన్న కుటుంబరావు చెపుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వ జీవోలోనే మర్చంట్‌ బ్యాంకర్‌కు ఎంత కమిషన్‌ ఇస్తున్నదీ చెప్పారు కదా? 0.85 శాతం  కమిషన్‌తో పాటు జీఎస్‌టీని మీరే చెల్లిస్తున్న విషయం జీవోలోనే రాశారు కదా? మరి మర్చంట్ బ్యాంకర్‌కు కమీషన్‌ చెల్లించారా? లేదా? ఈ రకంగా ఏకంగా రూ. 17 కోట్లు, జీఎస్‌టీ పన్నులు కలుపుకుని దాదాపు రూ. 20 కోట్లవరకు చెల్లించటం దుర్మార్గమా కాదా?

4) రూ. 2000 కోట్లకు  రూ.1573 కోట్లు ‘మాత్రమే’ వడ్డీ కడుతున్నాం అన్నారు. రూ.1573 కోట్లు వడ్డీగా చెల్లించటం, అదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సొమ్మును చెల్లించటం మీకు అంత ఆషామాషీ వ్యవహారంగా ఎలా మారిందన్నది మాకు అర్థం కావటం లేదు. ఇంకోపక్కన, మీరు లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కావాలంటున్నారు. మరి లక్షల కోట్ల రాజధానికి వడ్డీ కూడా లక్షల కోట్లు అవుతుంది కదా? ఇందులో అసలు ఎవరు కట్టాలి? వడ్డీలు ఎవరు కట్టాలి? ఇందులో లాభం పొందేది ఎవరు? మీరు ఈ రోజున, అదీ ఎన్నికలు ఆరు నెలలు కూడా లేవన్న సమయంలో హడావుడిగా  చేస్తున్న ఈ అప్పులకు రెండు మూడు తరాలు అసలూ వడ్డీలూ కట్టాలా? ఇలాంటి వడ్డీలతో ఎన్ని
హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టుల్ని, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్ని నిర్మించవచ్చో ఎప్పుడన్నా ఆలోచించారా?
 
5) మేం అనేకసార్లు చెప్పాం. మరోసారీ చెపుతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ బెంజికార్లు ఎక్కడ అమ్ముతారో తెలియక, దాని ఖరీదు తెలియక, దాన్ని ఎక్కడ పార్క్‌ చేయాలో తెలియక కొనుక్కోకుండా ఆగటం లేదు. వారికి కొనుగోలు శక్తి ఉంటే... అంటే ఫైనాన్స్‌లో అయినా తిరిగి చెల్లించే శక్తి ఉంటే కొంటున్నారు. లేదంటే లేదు. కానీ మీరు మాత్రం ప్రజలందరి నెత్తినా, రాబోయే తరాలమీదా నిప్పు  లాంటి అప్పును మూటగట్టి పెట్టి... మీకు కావాల్సిన కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

6) అప్పు తీసుకురావటానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏం చెప్పిందన్నది 2018 ఫిబ్రవరి 8న జీవో నంబర్‌ 65లో మీరే రాశారు కదా? పోనీ దానికైనా కట్టుబడ్డారా? హడ్కో నుంచి 8 శాతం లోపు వడ్డీ అయితేనే రుణం తీసుకోవాలని అందులో స్పష్టంగా చెప్పినది మీరే కదా? కేంద్ర ప్రభుత్వ అనుమతితో పన్నురాయితీకి సంబంధించిన ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ బాండ్లు కేవలం 6 శాతం వడ్డీకి విడుదల చేసి డబ్బు కూడగట్టాలని కూడా అందులో రాసుకున్నది మీరే కదా? మరి... 10.7 శాతం వరకు వడ్డీ చెల్లించేలా బాండ్లు అమ్మారంటే దీన్ని ఏమంటారు? గోల్‌మాల్‌ అనక గొప్పదనం అంటారా?

7) మీరు హడ్కోకు  ఎందుకు పోలేదన్నది మా ప్రశ్న కాదు. ఇంత భారీ వడ్డీ రేటుకు ఎక్కడ వీలుంటే అక్కడ ఎందుకు అప్పు చేస్తున్నారన్నది మా ప్రశ్న. మార్కెట్‌లో ప్రభుత్వాలకు బ్యాంకులనుంచి ఇంతకంటే తక్కువ వడ్డీకి డబ్బు వస్తున్నప్పుడు ఇంత భారీ వడ్డీ రేటు ఇస్తున్నారంటే
ఇది ఎవరినైనా బెనిఫిట్‌ చేసేందుకే, ఒక పథకం ప్రకారమే మీరు చేస్తున్నారా అన్నది మీ ట్రాక్ రికార్డును చూసిన తరవాత మాకు, రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న ధర్మసందేహం. అదీగాక, ఎవరు అప్పు ఇస్తాం అంటే వారి దగ్గర, ఎంత వడ్డీరేటుకైనా.... అదీ ఎన్నికలు ఇంకా నెలల్లో ఉన్నాయనగా మీరు ఎందుకు తీసుకువస్తున్నారు? ఆ డబ్బు ఇంతలోనే ఏం చేయదలచుకున్నారన్నది మా ప్రశ్న.  ఇక కుటుంబరావు ఇచ్చిన వివరణ చూస్తే... ప్రశ్న ఆయనే వేసుకున్నారు, అందుకు విరుద్ధంగా ఆయనే మాట్లాడారు.
1) తక్కువ వడ్డీకి అప్పు ఇప్పించగలుగుతారా? అని కుటుంబరావు అడిగారు. మా ప్రశ్న ఒకటే.. ప్రభుత్వం మీరు నడుపుతున్నారా? లేక గ్యాంబ్లింగ్‌ డెన్‌ వారెవరైనా నడుపుతున్నారా? రాష్ట్రప్రభుత్వ అభివృద్ధి లోన్లకు ఆర్‌బీఐ తక్కువకే వడ్డీ ఇస్తోంది అని తానే చెపుతూ... అలా తెస్తే భూములు తాకట్టు పెట్టాల్సి వస్తుంది కాబట్టి కుదరదని కుటుంబరావు చెప్పారు. ఒకవంక చంద్రబాబు ప్రభుత్వం ఏం చెపుతోంది? ఏ మార్గాల్లో అయినా రాజధానికి డబ్బు తీసుకువస్తాం అంటోంది. మరో వంక,  భూములు తాకట్టు పెట్టాల్సివస్తుంది కదా అంటున్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కడెక్కడినుంచి ఎంతెంత తెచ్చారు? వాటికి సంబంధించిన షరతులు ఏమిటి? ఎక్కడా ఏదీ తనఖా పెట్టకుండానే రుణాలు తెచ్చారా? చివరికి సాగునీటి ప్రాజెక్టుల్ని కూడా తనఖా పెట్టి రుణాలు తీసుకువచ్చారని మీకు అనుకూల పత్రికల్లోనే వార్తలు వచ్చాయి కదా? ఇవన్నీ నిజాలు అయినప్పుడు మరి ఈ రోజు రాజధాని అప్పుకు సంబంధించే ఈ కొత్త వాదనలు ఎందుకు చేస్తున్నారు?
2) కేంద్ర ప్రభుత్వం ఇవ్వనంటోంది కాబట్టి అప్పులకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వాలన్నది ఈ నాలుగేళ్ళలో మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యతలు ఎవరివి? శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానిని నిర్ణయించకముందే మీరు నారాయణ కమిటీ ఎందుకు వేశారు? మీరెందుకు రాజధాని విషయంలో అంత హడావుడి పడ్డారు? మీకు కావాల్సిన చోట ముందుగా భూములు కొని తరవాత ప్రకటన ఎందుకు చేశారు? విభజన చట్టం ప్రకారం అడవులు అంతరించిపోయిన భూముల్ని వారే ఇస్తాం అంటే మీరెందుకు తీసుకోలేదు?
3) బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే, వారు అడిగే ఎన్నో ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వాల్సివస్తుంది కాబట్టి, అలా సమాధానం చెప్పటానికి మీరు రెడీగా లేరు కాబట్టే కొత్త పద్ధతి కనుక్కుని బాండ్లకు వెళ్ళారు. అవునా, కాదా?
4) గ్రేటర్‌ హైదరాబాద్‌ బాండ్ల విషయంలో రీ పేమెంట్‌ సెక్యూరిటైజ్‌ అయింది కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు వచ్చిందన్నారు. అంటే దీని అర్థం గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఇకమీదట పన్నుల రూపంలో కట్టే డబ్బునుంచే, నేరుగా వడ్డీలూ అసలూ కట్టుకోవాలి. అందులో రాష్ట్ర ప్రజల ప్రమేయం ఉండదు.కానీ, రాజధాని పేరిట మీ బాహుబలి సెట్టింగులకు, మీ హంగూ ఆర్భాటాలకూ, మీరు చేసే భారీ అవినీతికీ, కుంభకోణాలకూ ప్రజల్ని పన్నుల రూపంలో డబ్బు కట్టమంటే ఎందుకు కడతారు చెప్పండి?
5) 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రాజధానికి ఏకంగా రూ. 15 వేల కోట్లనుంచి రూ.18 వేల కోట్లు అవసరం అవుతాయని; ఇటీవల... ఇన్ని వేల కోట్లు ఇక్కడినుంచి వస్తున్నాయి... అక్కడినుంచి వస్తున్నాయి అంటూ వార్తా కథనాల్లో రాయించుకున్నారు. ఆంధ్రాబ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంకు నుంచి రూ.2,600 కోట్లు; మొత్తంగా అన్ని బ్యాంకుల నుంచి రూ. 10,000 కోట్లు; హడ్కో నుంచి ఇప్పటికే రూ. 1,275 కోట్లు తెచ్చారని, ఇందులో రూ. 900 కోట్లు ఇప్పటికే  ఖర్చయిపోయిందని... మొత్తంగా హడ్కో నుంచి రూ.7,500 కోట్లు వస్తాయని, జనవరి నాటికి ప్రపంచ బ్యాంకునుంచి రూ.3,500 కోట్లు రాజధానికి రాబోతున్నాయని... మీకు అనుకూల పత్రికల ద్వారా మీరే ప్రజలకు సమాచారం ఇచ్చారు. తొలి దశ ప్రాజెక్టులకే రూ.48,115 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో రూ.26,600 కోట్ల విలువైన 32 పనులు జరుగుతున్నాయని మీ అనుకూల పత్రికలోనే రాశారు. ఈ డబ్బంతా ఎక్కడినుంచి వస్తోంది? తాకట్టు లేకుండానే డబ్బు వస్తోందా? లేనట్టయితే...వీటన్నింటికీ ఏం తాకట్టు పెడుతున్నారు? మీ సొంత భూముల్ని, మీ ఇంట్లో బంగారాన్ని తాకట్టుపెడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు ఇప్పిస్తారా? మీకే బ్రోకరేజి ఇస్తాంఅంటున్నారు.

7) కేంద్రాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా ఇవ్వకపోవటం వల్ల ప్రపంచ బ్యాంకును అడుగుతున్నాం అన్నారు. ఇదేమైనా పిల్లలు నాన్న ఇవ్వకపోతే అమ్మను అడిగిన వ్యవహారం లాంటిదా? కేంద్రం ఇవ్వకపోతే నాలుగేళ్లకు పైగా ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఇప్పటికీ ఎందుకు నిలదీయడం లేదు? మీరు ఈ నాలుగేళ్ళలో అధికారికంగా చేసిన రూ.1.20 లక్షల కోట్ల అప్పులు ఎటుపోయాయంటే లెక్క లేదు. ఆ అప్పులకు తోడుగా ఇప్పుడు కొత్త పద్ధతుల్లో, మీ పార్టీ ఎంపీలూ పెద్దలూ బ్యాంకుల్ని ముంచిన పద్ధతిలో రాష్ట్రాన్నే దివాలా రాష్ట్రంగా మార్చటానికి... లెక్కా పత్రం లేకుండా, ఎంత వడ్డీకైనా తీసుకుని బోర్డు తిప్పేయటానికి మీరు రెడీ అవుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేంగుడ్లప్పగించి, నోరు మూసుకుని కూర్చోవాలా? కుటుంబరావుగారు చెప్పే కట్టు కథలు వినాలా?

8) టెండర్లకు అనుకూలంగానే నిర్ణయించాం... ఎలాంటి అవినీతీ జరగలేదని కుటుంబరావు అంటున్నారు. మేం అడుగుతున్నది ఒక్కటే.. ఆ తొమ్మిది మందీ ఎవరు? వారి వెనకాల పెట్టుబడిదారులు ఎవరు? ఇంతవరకు మీరు తెచ్చిన డబ్బుకు సంబంధించిన నిబంధనలేమిటి? ఇవి చెప్పకుండా, నిందలు వేసి... నోరు చేసుకుని... ఏదేదో మాట్లాడితే ప్రయోజనం ఏమిటి?  

9) ఇక చివరిగా... ఇంత కీలక అంశానికి సంబంధించిన వివరణలు, ప్రకటనలు నేరుగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖమంత్రి కాకుండా నామినేటెడ్‌ వ్యక్తితో ఎందుకు చేయిస్తున్నారన్నది మొత్తంగా ఈ వ్యవహారంలో ఉన్నదంతా డొంక తిరుగుడే అనే అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.  



Back to Top