చ‌ర్చిస్తే విభజనకు ఒప్పుకున్నట్లు కాదా?

హైదరాబాద్, 26 డిసెంబర్ 2013:

ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అంగీకరించడం అంటే విభజనకు సమ్మతించినట్లు కాదా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము చేసిన విజ్క్షప్తికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ తనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రణ‌బ్ ముఖర్జీకి అఫిడవి‌ట్లు అందచేశామని శ్రీ వైయస్ జగన్‌ తెలిపారు. అఫిడవిట్‌ను ఆయన మీడియాకు చూపించారు. లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ జగన్ మాట్లాడారు.

కరెంటు బిల్లులు విపరీతంగా పెంచినప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని శ్రీ జగన్‌ తెలిపారు. సమైక్య వాదానికి తోడుగా నిలుస్తారనే భయంతోనే ఎమ్మెల్యేలపై కుట్ర చేసి, ఆలస్యంగా వేటు వేశారని శ్రీ వైయస్ జగ‌న్ ‌ఆరోపించారు. పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు శ్రీమతి విజయమ్మతో సహా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు, తనతో పాటు ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, అనర్హులైన 15 ఎమ్మెల్యేలలో 13 మంది కలిసి రాష్ట్రపతికి అఫిడవిట్లు అందజేశామన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది లోపు గడువుంటే ఉప ఎన్నికలు జరగవని తెలిసిన తర్వాత  3 నెలల పాటు సాగదీసి వారిని అనర్హులను చేశారని శ్రీ వైయస్ జగ‌న్ ఆరోపించారు. అయితే, వారు కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి సకాలంలో ఎన్నికలు జరిగితే మళ్ళీ గెలిచి, సమైక్యానికి తోడుగా నిలుస్తారనే దురాలోచనతోనే కుట్ర చేసి ఒక పథకం ప్రకారం ఆలస్యంగా అనర్హత వేటు వేశారన్నారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా పార్టీలకు అతీతంగా వెళ్లి తమ మాదిరిగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని శ్రీ జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను అఫిడవిట్లు ఇవ్వకుండా చంద్రబాబు ఆపుతున్నారని అన్నారు. కిరణ్, చంద్రబాబు ఏమి చెప్పినా వినకుండా ఆ పార్టీల ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతూ తమ మనస్సాక్షి ప్రకారం అఫిడవిట్లు ఇవ్వాలని శ్రీ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ రోజూ ఏదో ఒకటి చెబుతున్న సీఎం‌ కిరణ్ కుమార్‌రెడ్డి సీమాంధ్రులను ఇప్పటికీ మభ్యపెడుతున్నారని శ్రీ జగన్‌ విమర్శించారు. సచివాలయంలోని 56 విభాగాలకు ఇటీవల కిరణ్‌ ఓ నోట్ పంపించా‌రని తెలిపారు. విభజనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించడానికి ఉద్యోగులందరూ నిమగ్నం కావాలని ఆ నోట్‌లో ఆదేశించారని అన్నారు. విభజనకు సంబంధించి చర్చ జరగాలంటున్న వారి వద్ద కనీస సమాచారం లేదన్నారు. ఎలాంటి చర్చా జరగకుండానే రాష్ట్ర విభజన జరగాల‌ని కిరణ్ కోరుకుంటున్నారన్నారు. విభజన‌ విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీఎం కిరణ్ కుమా‌ర్‌రెడ్డి ఎందుకు తొందరపడుతున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిలదీశారు.

ఇంతకు ముందు ఇతర రాష్ట్రాల్లో జరిగిన విభజన గురించి అవగాహన ఉందా అని లక్నో వెళ్ళిన స్పీకర్‌ మనోహర్‌ను ఆయన ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ఏ‌మి జరిగిందో అవగాహన స్పీకర్‌కు ఉందా? అని అడగదలుచుకున్నా అని శ్రీ జగన్ అన్నారు. ఉత్తరాఖండ్‌ను విడగొట్టడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన వైనం స్పీకర్‌కు తెలుసా? అన్నారు. ఆ తీర్మానం చేసిన తర్వాతే ఉత్తరాఖండ్‌ను విడగొట్టారని ఆయన తెలిపారు.

అయితే.. మన రాష్ట్రానికి వచ్చే సరికి అసెంబ్లీ తీర్మానం అనే పదాని‌కే అర్థం లేకుండా చేశారని శ్రీ వైయస్ జగ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే డ్రాఫ్టు బిల్లు తయారుచేసి పంపించి చర్చించాలని కేంద్రం చెబుతోందని విమర్శించారు. అక్కడికి, ఇక్కడికి తేడా ఎంత ఉందో మీకు అర్థమవుతోందా? అని సీఎం, స్పీకర్‌లను శ్రీ జగన్‌ నిలదీశారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

సమైక్య తీర్మానం చేసి, విభజనను అడ్డుకోకపోతే సీఎం కిరణ్‌, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ విభజన బిల్లును అసెంబ్లీలో గట్టిగా వ్యతిరేకించాలని కోరారు. సమైక్య తీర్మానం చేసేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సమైక్య తీర్మానం చేస్తే పార్లమెంటులో కూడా మన బలం పెరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా ఆపే శక్తి మనకు వస్తుందన్నారు. కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా మన బలం పెరుగుతుందన్నారు.

విభజన బిల్లుపై చర్చకు టీడీపీ నాయకులు, కుట్రపూరితంగా వ్యవహరించేవారూ మొగ్గు చూపుతుండడం మన దురదృష్టం అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు శ్రీ జగన్‌ బదులిచ్చారు. విభజనపై అసెంబ్లీలో అభిప్రాయం తీసుకోకుండా డ్రాఫ్టు బిల్లుపై చర్చించడంలో అర్థం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని విడగొడితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో, ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయో వివరిస్తూ.. ఒక నోట్‌ ఇస్తామని, సమైక్య తీర్మానం చేయాలని అసెంబ్లీలో తమ పార్టీ గట్టిగా పట్టుపడుతుందని మరో ప్రశ్నకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విభజన డ్రాఫ్టు బిల్లుపై చర్చకు వైయస్ఆర్‌సీపీ నుంచి ఎటువంటి మద్దతు ఉండబోదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాం అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోపెట్టిన రాష్ట్రంతోనే కాంగ్రెస్ ‌అధిష్టానం ఆటలాడుతోందని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Back to Top