విద్యుత్‌ బంద్‌ విజయవంతం

హైదరాబాద్, 9 ఏప్రిల్‌ 2013: విద్యుత్‌ చార్జీల పెంపు, సర్‌ చార్జీల బాదుడు, విద్యుత్‌ కోతలకు నిరసనగా మంగళవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా కాంగ్రెసేతర పార్టీలు నిర్వహించిన రాష్ట్ర బంద్‌ విజయవంతం అయిందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. ఈ బంద్‌ ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలని సూచించారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అవినీతి కారణంగా పెరిగిన విద్యుత్‌ ధరలకు ప్రజలు మూల్యం చెల్లించాలా అని ఆయన ప్రశ్నించారు. పన్నుల భారం తగ్గించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు.

మొత్తం గ్యాస్‌ ఫెర్టిలైజర్‌ పరిశ్రమలకే.. :
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం గ్యాస్‌ను ఫెర్టిలైజర్‌ పరిశ్రమలకు తరలించమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభం వచ్చిపడిందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఫెర్టిలైజర్‌ పరిశ్రమలకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గ్యాస్‌ ద్వారా రాష్ట్రంలో ఒక్క యూనిట్‌ కూడా విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఒక పక్కన పన్నులు వేస్తూనే మరో పక్కన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల మోత మోగిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం అవినీతి, అవకతవకల విధానాల వల్ల పెరిగిన విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. గతంలో విద్యుత్‌ సగటు కొనుగోలు ధర రూ. 2.10 నుంచి రూ. 2.20 ఉండేదని అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో 2012 -13 సంవత్సరానికి గాను ఒక్కసారిగా రూ.3.15 కు పెరిగిందన్నారు. 2013- 14 సంవత్సరానికి గాను ఎపిఈఆర్‌సి అందజేసిన ప్రతిపాదనల ప్రకారం రూ. 4.07గా ఉందన్నారు. అనవసరంగా పెరుగుతున్న ఈ కొనుగోలు ధరపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మైసూరా డిమాండ్‌ చేశారు. ఇంతకు మించి ధరలు పెరగాల్సిన అవసరం కూడా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయంగా ఉందన్నారు.

ప్రభుత్వం అవినీతి, అవకతవకల విధానాల వల్లనే‌ విద్యుత్ సగటు కొనుగోలు ధర పెరుగుతున్నదని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోలు ధర రూ. 5.11 ఉందన్నారు. ఇంత ధర పెట్టి కొనాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బొగ్గు ధర పెరగడానికి బాధ్యత పూర్తిగా కేంద్రప్రభుత్వానిదే అన్నారు. బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయించాలి గాని అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచుతామని చెప్పడం చాలా అన్యాయం అన్నారు. ఇలాంటి తప్పుడు విధానం కారణంగానే జెన్కోలో అవినీతికి ఆస్కారం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంత్రుల ఒంటెత్తు పోకడల వల్లే గ్యాస్‌ రావడంలేదు :
మంత్రులు ఒంటెత్తు పోకడలతో తీసుకున్న నిర్ణయం కారణంగానే మన రాష్ట్రానికి గ్యాస్‌ రావడం లేదని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. అందువల్లే ఒక్క మెగా వాట్‌ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితిలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం మన రాష్ట్రానికి చెందిన ఎంపీలైనా కేంద్రంతో మాట్లాడి కొంతైనా గ్యాస్‌ను రాష్ట్రానికి తెచ్చుకుని ఉంటే ఇంతగా విద్యుత్‌ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. ఈ సమస్యకు మూల కారణం ప్రభుత్వం విధానం అని ఆరోపించారు. ఒక వైపున ఒంటెత్తు పోకడలతో ఈ ప్రభుత్వం ఎపిఆర్‌సిని ముందు పెట్టుకుని ధరలు పెంచడం, సర్‌ చార్జీలు వేయడం చాలా అన్యాయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల కోల్‌ ఇండియా రూ. 63 వేల కోట్ల లాభాల్లో ఉందని, ఓఎన్‌జిసి రూ. 23 వేల కోట్లు, ఆయిల్‌ ఇండియాకు రూ. 13 వేల కోట్లు ఆదాయం వస్తోందని మైసూరారెడ్డి అన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ చార్జీలు పెంచకుండా ఉండేందుకు సబ్సిడీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. బొగ్గుకు కానీ, గ్యాస్‌కు గానీ అంతర్జాతీయ ధరలు నిర్ణయించాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.

టిడిపి ఒక్క మెగావాట్ ఉత్పత్తి చేయలేదు‌ :
విద్యుత్ సంక్షోభానికి దివంగత వై‌యస్ విధానాలే కారణమని ఆరోపిస్తున్న ‌టిడిపి.. తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క మెగావాట్ థర్మ‌ల్ విద్యు‌త్‌ను అయినా ఉత్పత్తి చేసిందా అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. మహానేత వైయస్ పాలించిన 2004‌ - 09 మధ్య కాలంలో 1,630 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యు‌త్ ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగితే 2010 నాటికి పూర్తయ్యాయన్నారు. ఆయన హయాంలోనే మరో 3,300 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ప్రారంభించారని, అవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ‌టిడిపి హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న 4 గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు పూర్తయినా గుదిబండలుగా మారి వేల కోట్ల‌ రూపాయల భారం ప్రజలపై పడటాన్ని గుర్తుచేశారు. హెరిటేజ్ పాలపై తమ పార్టీ చేసిన ఆరోపణలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అని, అందుకు ‌ఆ సంస్థే సమాధానం చెప్పుకోవాలని అన్నారు.


సిఎం ప్రకటన కంటితుడుపు చర్యే :
విద్యుత్‌ను 200 యూనిట్లు లోపు వాడుకునే వారికి ధరలు పెంచం అని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డ చెప్పిన మాటలు కేవలం కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. గ్రామాల్లో విద్యుత్‌ వినియోగమే చాలా తక్కువ ఉంటుందని, వారికి కూడా ప్రభుత్వం విద్యుత్‌ కోతల పేరుతో సరఫరా చేయనప్పుడు ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు వల్ల ఏమాత్రమూ ఉపయోగం లేదన్నారు. పన్నుల రూపంలో రూ. లక్షా 20 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదాయంగా సమకూర్చుకుంటోందన్నారు. ఇలాంటప్పుడు ఇంకా చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్‌ చార్జీలు, సర్‌ చార్జీలు తగ్గించమనే తమ పార్టీ రాష్ట్ర బంద్‌ను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నామన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు అన్ని జిల్లాల్లోనూ జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరా బదులిచ్చారు. అయితే, హైదరాబాద్‌లో కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చామన్నారు. మిగతా అన్ని చోట్లా బంద్‌ సక్సెస్‌ అయిందన్నారు.
Back to Top