టిడిపి నాయకుల బట్టలు తడుస్తున్నాయ్‌!

 హైదరాబాద్, 26 సెప్టెంబర్‌ 2012: ఐఎంజీ భూముల కుంభకోణం విషయంలో చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుల బట్టలు తడిసిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కుంభకోణంపై వచ్చే వారం సిబిఐ విచారణ చేయనున్నదని పేర్కొంది. విద్యుత్‌పై సర్‌చార్జి విధించడం, డిజిల్‌, బస్సు చార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్‌ సిపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నాలు విజయవంతమయ్యాయని పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సే జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో టిడిపి నాయకుల ద్వంద్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్నిచోట్ల పోలీసులు తమ పార్టీ శ్రేణులపై అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ లాంటి కొన్ని చోట్ల వైయస్‌ఆర్‌ సిపి నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి వికృత చేష్టలను తమ పార్టీ లెక్క చేయబోదని జూపూడి పేర్కొన్నారు. 

కేవలం ఒక ప్రభుత్వ కార్యదర్శి సంతకంతో ఐఎంజి భూములను బిస్కెట్ల మాదిరిగా చంద్రబాబు నాయుడు పంచిపెట్టేశారని జూపూడి నిప్పులు చెరిగారు. ఐఎంజి భూముల పందేరంపై‌ ఈనాడు సహా ఎన్నెన్నో పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు ఎ.బి.కె. ప్రసాద్‌, విజయసాయిరెడ్డి గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని, దానిపై ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణకు సిద్ధమైందని చెప్పారు.‌ రాష్ట్ర ప్రజలతో మమేకమై, వారి సాధక బాధకాల్లో పాలు పంచుకుంటున్న జగన్మోహన్‌రెడ్డిపైన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎర్రంనాయుడు, కాంగ్రెస్‌ నాయకుడు శంకర్రావు పిల్‌ వేయవచ్చని, తమ దాకా వచ్చే సరికి టిడిపి నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆయన దుమ్మెత్తిపోశారు. ఇదెక్కడి న్యాయం అని జూపూడి నిలదీశారు. ఐఎంజి భూముల కుంభకోణం మీద దర్యాప్తు చేయాలంటూ ఎబికె ప్రసాద్‌ పిల్‌ వేస్తే ఆయనను వైయస్‌ఆర్‌ సిపి కార్యకర్తగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకే మహానేత వైయస్‌ఆర్‌ అనుచరుడని ఎర్రంనాయుడు అభివర్ణించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని జూపూడి దుయ్యబట్టారు. 'నడుస్తున్న సమాచార కేంద్రం' లాంటి ఎబికె ప్రసాద్‌ పట్ల అనుచితంగా మాట్లాడిన టిడిపి నాయకులకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

'వస్తున్నా - మీ కోసం' అంటూ చంద్రబాబు చేయాలనుకుంటున్న పాదయాత్రకు ప్రజల నుంచి తిరస్కారం తప్పదని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. జగన్‌ను జైలులో పెట్టి, ఆయన గొంతు నొక్కేసిన వైనాన్ని జనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. బాబుకు బాకా ఊదే వాళ్ళంగా సిబిఐ విచారణను ఎవుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జూపూడి హెచ్చరించారు. చంద్రబాబు పరిపాలనతో చిర్రెత్తిపోయి 2004లో తిరస్కరించిన రాష్ట్ర ప్రజలు మరోసారి ఆయనకు అధికారం అప్పగించేందుకు సిద్ధంగా లేరన్నారు. అప్పటి చంద్రబాబు పాలన, ఇప్పటి కాంగ్రెస్‌ ఏలుబడి దొందూ దొందే అన్న విధంగా ఉన్నాయన్నారు. అందుకే ప్రజలంతా ఇప్పుడు తమ కష్టాలు తీర్చేది జగన్మోహన్‌రెడ్డే అని ఆయన వైపు చూస్తున్నారన్నారు.

కాగా, ఇటీవల ముగిసిన ఐదు రోజుల శాసనమండలి సమావేశాలను కాంగ్రెస్‌, టిడిపిలు అపహాస్యం చేశాయని, ఒక ప్రహసనంగా మార్చివేశాయని జూపూడి ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీలు చర్చించకపోగా అందుకు ముందుకు వచ్చిన తమ పార్టీని కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో విధంగా మరో ఏడాదిన్నర కాలం గడిపేయాలన్న ధోరణిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోందని, ప్రజల పక్షాన ఉండకుండా ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి ప్రభుత్వానికి వంతపాడే విధంగా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Back to Top