టీచర్ల సమస్యలపై వైయస్‌ఆర్‌ సిపి ఉద్యమాలు

హైదరాబాద్‌, 23 సెప్టెంబర్‌ 2012: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టీచర్స్‌ 
ఫెడరేషన్‌ నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించేందుకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫెడరేషన్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి నేతృత్వంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు ఇవీ :
‘ఉపాధ్యాయులకు పదవ పీఆర్సీ అమలుచేయాలి.
డీఎస్సీ 2008 ఉపాధ్యాయులకు నియామకపు తేదీ నుంచి రెగ్యులర్‌ స్కేల్ ప్రకటించాలి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీవైఈవో, ఎన్‌వీవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
రూ.398కే పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సోషల్‌ స్టడీస్‌కు రెండో పోస్టు మంజూరు చేయాలి.
పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ ‌చేయాలి.
మహిళా ఉపాధ్యాయులకు రెండేళ్ల పాటు చైల్డ్‌కేర్‌ సెలవు ఇవ్వాలి.
ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు 010 జీవో కింద జీతాలు చెల్లించాలి.
మున్సిపల్‌ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి’
ఈ అంశాలతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఉపాధ్యాయులకు, విద్యా రంగానికి దివంగత ముఖ్యమంత్రి వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, మేలును పలువురు ఉపాధ్యాయులు గుర్తుచేశారు. వాటిని ఉపాధ్యాయలోకానికి వివరిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని చెప్పారు.
వైయస్‌ఆర్‌ టిఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.కులశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి‌ గట్టు రామచంద్రరావు, వై.విశ్వేశ్వరరెడ్డి, ఫెడరేషన్ సలహాదారులు ఎ‌ల్.వి.కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, స్టీరింగ్‌ కమిటీ నేతలు కె.జాలిరెడ్డి, టి.ప్రకాష్, జె.విజ‌య్‌కుమార్, వి.జె.కెనడీ, టి.వి.రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Back to Top