సమైక్య తీర్మానానికి పట్టుపట్టండి

హైదరాబాద్, 14 డిసెంబర్ 2013:

  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా శాసనసభ్యులు ఖాతరు చేయవద్దని, సమైక్యభావాన్ని వీడొద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఆత్మప్రబోధానుసారం వ్యవహరించాలని‌ శ్రీ జగన్ విజ్క్షప్తి చేశారు. సమైక్యానికి తీర్మానం చేయాలని కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలంతా గట్టిగా పట్టుపట్టాలన్నారు. సమైక్య తీర్మానంపై ఓటింగ్‌ జరిపించి అందరూ పాల్గొని సమైక్యానికి అనుకూలంగా ఓటు వేసి అందరం కలిసికట్టుగా ఒక్కటై రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. 'ఈ పని జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే చేయలేడు. జగన్మోహన్‌రెడ్డికి మీ అందరి మద్దతు కావాలి. కిరణ్, చంద్రబాబు ఇద్దరికీ బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ.. వీరు చరిత్రపుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కానీ.. మీ ఎమ్మెల్యేలందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కిరణ్ ఏం చెప్పినా.. చంద్రబాబు ఏం చెప్పినా.. వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేసి మన రాష్ట్ర పరిస్థితిని దేశం మొత్తం చూసేట్లుగా చేయాలని మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకు ప్రతి ఎమ్మెల్యే ముందుకు రావాలి’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి కేంద్రం పంపిన నేపథ్యంలో శ్రీ జగన్‌ శనివారం లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన అడ్డగోలు వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని శ్రీ వైయస్‌ జగన్ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. శాసనసభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమని ఉద్ఘాటించారు. తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

విభజనను అడ్డుకోవాలని గడప గడపకూ వెళ్లాం :
‘మేము, మా పార్టీ తరఫున నెల రోజులకు పైగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే గట్టి నినాదంతో.. ఆర్టికల్-3ను సవరించటం ద్వారా మన రాష్ట్రాన్ని విడగొట్టకుండా చూడాలని దాదాపుగా ప్రతి రాష్ట్రానికి వెళ్లాం.. అక్కడి పాలకులు, నాయకుల గడప, గడపనూ తొక్కాం.. వాళ్లను అర్థించాం. ‘రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని మీరు ముందుకొచ్చి అడ్డుకోకపోతే మీకూ ఇదే పరిస్థితి వస్తుంది.. వెనక్కి తిరిగి చూస్తే మీ వెనకాల ఎవరూ ఉండరు.. కాబట్టి దీనిని అడ్డుకోవాలి’ అని కోరాం. కనీవినీ ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఏ రాష్ట్రాన్నీ విడదీయని విధంగా ఓట్లు, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని చెప్పాం. అన్ని పార్టీలూ బాగా స్పందించాయి.'

'మేం కలిసిన నాయకులు మీడియా ముందుకు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించిన విభజన మీద వేరే రాష్ట్రాలకు చెందిన పెద్ద పార్టీలతో వాయిదా తీర్మానాలను ఇప్పించాం. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద పార్లమెంటులో వాళ్ల చేత మాట్లాడించడంలో సఫలీకృతం అయ్యాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయం ఏమిటన్నది దేశం మొత్తం గమనించే పరిస్థితుల్లోకి తీసుకు వెళ్లాం’ అని శ్రీ వైయస్ జగ‌న్‌ వివరించారు. ‘కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే నిజంగా బాధేస్తోంది. మొదట జూలై 30న సీడబ్ల్యూసీలో విభజనకు తీర్మానం చేశారు. ఆ తరువాత కేంద్రమంత్రుల బృందం ఏర్పాటైంది. ఆ తరువాత ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి అసెంబ్లీకి కూడా వచ్చింది’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

17 గంటల్లో అసెంబ్లీకి బిల్లు పంపుతారా? :
‘నిజంగా ఇక్కడ నాకొక సామెత గుర్తుకు వస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతగా మోసం చేస్తున్నారు అంటే.. తొలుత సీడబ్ల్యూసీ తీర్మానం చేసినపుడు మనందరి కాళ్ల కిందకు నీళ్లు వచ్చాయి. అయినా కిరణ్ మాత్రం ‘అబ్బే ఫర్వాలేదు‌ అన్నీ నేను చూసుకుంటాను’ అన్నారు. ఆ తరువాత జీవోఎం ఏర్పాటైంది. అపుడు నీళ్లు మోకాళ్ల దాకా వచ్చాయి. అపుడు సమ్మె చేస్తున్న ఉద్యోగుల చేత కిరణ్ ఏకంగా దానిని విరమింపజేశారు. ‘అంతా నేను చూసుకుంటాను’ అన్నారు. ఆ తరువాత నీళ్లు నడుము దాకా వచ్చాయి. ముసాయిదా బిల్లు జీవోఎం నుంచి రాష్ట్రపతికి, అటు‌ నుంచి అసెంబ్లీకి వచ్చింది. ఇపుడు పీకల దాకా నీళ్లు వచ్చాయి. కిరణ్ మాత్రం 371‌ డీ ఉందని చెప్తూ ఇంకా మోసం చేస్తున్నారు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మొన్న గురువారం రోజున రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో బిల్లు వస్తే మనం చూస్తూ ఉండగానే కేవలం 17 గంటల్లో దానిని ముఖ్యమంత్రి వివిధ శాఖలకు పంపి, ఆయా కార్యదర్శులతో సంతకాలు తీసుకున్నారు. తానూ సంతకం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా కేవలం 17 గంటల్లోనే యుద్ధప్రాతిపదికన అసెంబ్లీ స్పీకర్‌ కుపంపారు. యుద్ధప్రాతిపదికన బిల్లును పంపి కూడా కిరణ్ ఇంకా మోసం చేస్తున్నారు. ఇలాంటి అన్యాయం చేస్తున్నావయ్యా కిరణ్?’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‌‘ఓ వైపు కిరణ్‌కుమార్‌రెడ్డి దారుణంగా మోసం చేస్తున్నారు. బిల్లుకు పూర్తిగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇంకొకవైపు దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చి దగ్గరుండి మరీ బిల్లును చకచకా నడిపించారు. ఇప్పటికైనా మేలుకోండి‌ లేకుంటే చరిత్ర పుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు’ అంటూ హితవుపలికారు.

సమైక్యం అనే పదం బాబు నోటి నుంచి రాదేం? :
‘ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఇంకా బాధేస్తుంది. ఆయనకు లోక్‌సభలో ఆరుగురు ఎంపీలున్నారు. నలుగురు సభ్యులు మాత్రమే సమైక్యం కోసం ముందుకు వస్తారు. ఇద్దరేమో ఆవైపు ఉంటారు. ఆ పార్టీకి చెందిన లోక్‌సభా పక్షం నాయకుడు అయితే కనపడను కూడా కనిపించడు. చంద్రబాబు సమైక్యానికి ఒక లేఖ ఇస్తారేమో అవిశ్వాసానికి మద్దతు ఇస్తారేమో అని చూస్తే అది చేయరు. నలుగురు ఎంపీలు మాత్రమే సమైక్యం కోసం పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానం ఇస్తారట. దేశమంతా చూస్తుండగానే నలుగురి చేత సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టిస్తారు. ఇద్దరి చేత తెలంగాణకు అనుకూలంగా ప్లకార్డులు పట్టిస్తారు. (లోక్‌సభలో టీడీపీ ఎంపీలు నలుగురు ఓవైపు, మరో ఇద్దరు ఇంకొక వైపు నిలబడి ప్రదర్శించిన వేర్వేరు పచ్చరంగు ప్లకార్డులను శ్రీ జగన్ తన వెంట తెచ్చి ‌మీడియాకు చూపించారు).

`రాష్ట్రంలో కూడా ఇదే తీరు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. అందులో ట్యూషన్ చెప్పినట్లుగా చెప్తారు. నేను కూడా చూస్తూ ఉన్నా. చంద్రబాబు వారం రోజులుగా ప్రె‌స్‌మీట్లు పెడుతున్నా... ఒక్క రోజంటే ఒక్క రోజు, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా సమైక్యం అనే పదం మాత్రం ఆయన నోటి నుంచి రాదు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని లేఖ కూడా రాయడు. విభజనను వ్యతిరేకిస్తున్నానని ఇవాల్టికీ అనడు. ఇవా రాజకీయాలు అని ప్రశ్నిస్తున్నా?’ అని శ్రీ వైయస్ జగ‌న్ నిలదీశారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందన్నారు.

ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే‌..:
‘ఇప్పుడు దేశంలో మూడో అతి పెద్ద బడ్జెట్ మన రాష్ట్రానిది. ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే 9వ స్థానం కోసం ఒక రాష్ట్రం పోటీ పడుతుంది. 14వ స్థానం కోసం మరో రాష్ట్రం పోటీ పడుతుంది. హిందీ తరువాత అతి పెద్ద జాతి మనది. ఒకసారి విభజిస్తే మన పరిస్థితి ఏమిటనేది ఒక్కసారి గమనించండి. ఒక్కసారి విభజిస్తే మహానగరం ఒకవైపు, సముద్ర తీరం ఒకవైపు ఉంటుంది. ఎయి‌ర్‌పోర్టు (విమానాశ్రయం), సీపోర్టు (నౌకాశ్రయం) వేర్వేరు అయిపోతాయి. ఉద్యోగాల కోసం పిల్లలు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళతారు. జీతాలకు డబ్బులివ్వలేని పరిస్థితిలో రాష్ట్రాలు కొట్టుకోవాల్సి వస్తుంది. నీళ్లు దొరకని పరిస్థితిలో రైతన్నలు ఈ నాయకులను కాలర్ పట్టుకోవాల్సి వస్తుంది’ అని ‌శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దయచేసి అందరూ సమైక్యం కోసం పూర్తి సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’ అని కోరారు.

ఓటమికి ఒప్పుకోను..‌ తుదిదాకా పోరాడతా :
‘ఇపుడు సమైక్య తీర్మానం చేస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవడం సాధ్యమేనా?’ అని విలేకరులు ప్రశ్నించినపుడు.. ‘కచ్చితంగా.. ఎస్, వియ్ వి‌ల్ ఫైట్. విభజనను అడ్డుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకుంటాం. (ప్రశ్న అడిగిన విలేకరిని ఉద్దేశించి మాట్లాడుతూ) మీకూ, నాకూ తేడా ఒక్కటే.. మీరు ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోను. ఓటమి అన్నదానిని నేనొప్పుకోను. నా శక్తియుక్తులన్నీ ఒడ్డి చివరిదాకా పోరాడుతాం’ అని‌ శ్రీ జగన్ ‌స్పష్టంగా పేర్కొన్నారు.

ఎవరు, ఎవరితో కుమ్మక్కయ్యారు :
కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్క‌యినందు వల్లే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. ‘రాష్ట్రాన్ని విడగొడుతున్నది ఎవరు? కాంగ్రెస్..! విడగొట్టడానికి సహకరిస్తున్నదెవరు? చంద్రబాబు..! రాష్ట్రాన్ని విభజించవద్దని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది మేము..! అసలు సిగ్గుందా చంద్రబాబుకు.. ఇలాంటి అభాండాలు మా పై వేయడానికి? చంద్రబాబును ఇప్పటికీ ఒకటి అడుగుతున్నా.. ఈ రోజుకు కూడా సమైక్యానికి అనుకూలంగా లేఖ ఎందుకివ్వడం లేదు అని? మా వైపు వేలు చూపే బదులు తాను సమైక్యానికి అనుకూలంగా లేఖ ఎందుకు ఇవ్వడం లేదు.. అని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు? ఆయనను లేఖ ఇవ్వవద్దని ఎవరైనా మెడమీద కత్తి పెట్టారా? మరి ఈ రోజుకూ ఎందుకివ్వడం లేదు? ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు?’ అని శ్రీ జగన్ ప్రశ్నలు సంధించారు.

‘మా పై ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేసే ముందు చంద్రబాబు తన అంతరాత్మను తానే ప్రశ్నించుకోవాలి. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన కుప్పంకు వెళితే ప్రతి రైతన్న కాలర్ పట్టుకుని నీళ్ల కోసం ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తాడు. ప్రతి చదువుకున్న పిల్లవాడు కాల‌ర్ పట్టుకుని ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నిస్తాడు. అందుకే ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి ఇప్పటికైనా ముందుకు రండి. ఇప్పటికైనా సమైక్యానికి అనుకూలంగా లేఖ ఇవ్వండి. ఈ రోజు కూడా ఇంకా సమయం మించిపోలేదు’ అని సూచించారు.

సోనియాకు‌ మేం మద్దతు ఇవ్వం :
‘ఎన్నికల తరువాత సోనియాగాంధీకి మద్దతు ఇవ్వబోమని చెప్పగలరా?’ అని విలేకరులు ప్రశ్నించినపుడు.. ‘సోనియాగాంధీకి మద్దతు ఇవ్వబోమని ఘంటాపథంగా ఇపుడు కాదు చెప్పింది. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. వారికి ప్రధాని పదవికి మద్దతునిస్తామని హైదరాబాద్ సభలో లక్షలాది జనం సమక్షంలో ‌ఆవాళే చెప్పాం. ఇవాళ కొత్తగా చెప్పేదేమీ కాదు. అసలు చంద్రబాబును అడగాలి.. ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా తమ సభ్యులను రాజ్యసభలో గైర్హాజరు చేయించి కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిందెవరు? కిరణ్ అడ్డగోలుగా విద్యు‌త్ చార్జీలు పెంచినపుడు వి‌ప్ జారీ చేసి మరీ కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని కాపాడిందెవరు? అని అడగాలి. దివంగత ముఖ్యమంత్రి వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన పద్దెనిమిది నెలల తరువాత జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వ‌చ్చిన రెండు నెలలకు కలిసికట్టుగా కోర్టుకు వెళ్లింది ఎవరో కాంగ్రెస్, చంద్రబాబులను అడగాలి. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు’ అని శ్రీ జగన్ ‌అన్నారు.

అవిశ్వాసం వల్ల లాభం లేదు :
‘రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ దశలో అవిశ్వాసం పెట్టటం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. అసెంబ్లీలో మొట్టమొదట ఇపుడు చేయాల్సింది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయటం. ఆ తరువాత ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా ఫర్వాలేదు. ఇంకొకటి పెట్టినా ఫర్వాలేదు. అపుడు అందరమూ కలిసికట్టుగా మద్దతునిస్తాం. ఎలాగూ 70 రోజుల్లో ఎన్నికల షెడ్యూలే వచ్చేస్తుంది.. కాబట్టి ఈ 70 రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతారా? పడగొట్టరా? అనేది అడగాల్సిన ప్రశ్నే కాదు. ఎలాగూ 70 రోజుల తరువాత ఈ ప్రభుత్వం పోతుంది. బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇపుడు కావాల్సిందల్లా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఒక్కటై సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయటం. అదే తక్షణ కర్తవ్యం’ అని శ్రీ జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా వివరించారు.

‌లాగి పెట్టి చెంప మీద కొట్టండమ్మా :
‘మిమ్మల్ని దిగ్విజయ్‌సింగ్ తమ డీఎన్‌ఏ (జన్యువే) అన్నారు కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పిలిచి.. లాగి ఒకటి కొట్టండమ్మా చెంపకేసి...’ అని‌ శ్రీ జగన్ తీవ్రంగా స్పందించారు. ‘మోడీతో పొత్తు పెట్టుకుంటారా?’ అనే ప్రశ్నకు.. ‘ఇపుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులేమిటి? మీరడుగుతున్న ప్రశ్న ఏమిటి? రాష్ట్రం మొత్తం ఒక సమస్యతో ఉడికిపోతూంటే రానున్న వారం పది రోజులు కీలకమైనవైనపుడు ఇలాంటివి చర్చించడం సరికాదు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి జవాబిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top