ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేంద్రం

హైదరాబాద్, 7 నవంబర్ 2013:

ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానిస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ప్రారంభమై నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అన్నట్లు గురువారం నాడు కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం నిర్వహించి, రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలని, ఏయే అంశాలపై దృష్టి సారించాలని చర్చించడం ఏమిటని నిలదీసింది. విభజనకు అన్ని విధాలా సహకరిస్తూ‌ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, లేఖ ఇచ్చి వెనక్కి తీసుకోని చంద్రబాబు మద్దతు కారణంగానే కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దూకుడుగా ముందుకు వెళుతోందని దుయ్యబట్టింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు, కుల సంఘాల వారందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తోందని ఆమె అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆమె నిప్పులు చెరిగారు. ఉద్యమాలను గుర్తించే పరిస్థితి లేని అహంకారంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.

రాష్ట్రం అభివృద్ధి గురించి గాని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గాని పట్టించుకోకుండా రాయల తెలంగాణను తెర మీదికి తీసుకువస్తున్న వారిని శోభా నాగిరెడ్డి తూర్పారపట్టారు. కేవలం సొంత రాజకీయ లబ్ధి కోసమే విభజనను కేంద్రం వేగంగా ముందుకు తీసుకువెళుతోందని ఆరోపించారు. కర్నూలు, అనంతపురంలను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించే హక్కు జేసీ దివాకరరెడ్డి, టీజీ వెంకటేష్‌, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మరికొందరు, ఎఐఎం ఒవైసీకి గాని ఎవరిచ్చారని ప్రశ్నించారు. మొత్తం అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ అని పేరుపెట్టి సమైక్యంగా ఉంచాలని ఎందుకు డిమాండ్‌ చేయలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమలో గెలిచే అవకాశం లేని వారు రాయల తెలంగాణ అంశాన్ని తెస్తున్నారని విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి రకరకాల డిమాండ్లను తెస్తున్నారన్నారు.

ఒక సమస్యను పరిష్కరించమని కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే.. రాష్ట్రంలో రకరకాల సమస్యలు తీసుకువస్తున్నదని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ప్రాంతాలు, జిల్లాల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి, అభద్రత కల్పించిందన్నారు. దివాకరరెడ్డికి గారి మరెవ్వరికైనా గాని రాయలసీమను విభజించమని అడిగే హక్కు లేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు.

రాష్ట్రాన్ని విభజించడానికి వీలులేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శోభా నాగిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతునూ కూడగట్టుకుని విభజనను అడ్డుకోవడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్ని అవకాశాలనూ సద్వినియోగించుకుంటారని శోభా నాగిరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.

ఉద్యమాన్ని దిగజార్చవద్దు - వెంకట్రామిరెడ్డి :
తెలుగువారి కడుపు మండి రోడ్ల మీదకు వచ్చి నూరు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పోరాడుతున్నారని అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే దిశగానే సీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపాలనే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు. బ్రిటిష్‌ వారి విధానం విభజించి పాలించు అన్నట్లే కాంగ్రెస్‌, టీడీపీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. రాయలసీమ పౌరుషం అని చెప్పుకునే నాయకులు ఓట్లు, సీట్ల కోసం ఎంతటికైనా దిగజారిపోతున్నారని విమర్శించారు. ఉద్యమాన్ని దిగజార్చవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలోని తెలుగువారంతా ఐక్యంగా ఉండాలనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారన్నారు.

నీటి విషయంలో రాయలసీమకు ఏ కొంచెమైనా మేలు జరిగిందంటే అది కేవలం దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అని ఒక ప్రశ్నకు శోభా నాగిరెడ్డి బదులిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top