సీబీఐ దుర్నీతిని ఖండించరేం!

హైదరాబాద్, 06 మే 2013: కాంగ్రెస్ పార్టీ సీబీఐని తన ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతూ పబ్బం గడుపుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో దాఖలు చేయాల్సిన అఫిడవిట్ ప్రధాన మంత్రి కార్యాలయానికి చూపించానని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టులో అంగీకరించడం బట్టీ ఆ సంస్థ స్వతంత్రంగా వ్యవహరించడంలేదనే అంశం వెల్లడయ్యిందని  తెలిపారు. సోమవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ ప్రభుత్వానికి తొత్తులా ప్రవర్తిస్తోందని తెలిసినప్పటికీ చంద్రబాబుకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. ప్రతి చిన్న అంశానికీ రాద్ధాంతం చేసే టీడీపీ అధ్యక్షుడు దీనిపై ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని చెప్పుకునే ఆయనకు సీబీఐ నిస్సిగ్గుగా ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కవడమే దీనికి కారణమని భూమన స్పష్టంచేశారు.

కాంగ్రెస్ పార్టీతో బేషరతు ఒప్పందాలు చేసుకున్నారనడానికీ, ప్రజారాజ్యం పార్టీలాగే అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు వీలుగా అవసరమైన రాజకీయ చతురతను నెరుపుతున్నారనడానికీ ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలన్నారు. సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడితే 50 ప్రభుత్వ సంస్థలను అమ్మకం పెట్టిన అంశంలో వాస్తవాలు వెల్లడవుతాయేమోనని చంద్రబాబు భయపడుతున్నారా అనే సందేహం కలుగుతోందన్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ హత్య, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు అనుమానాస్పద మృతి గురించి, ఐఎమ్‌జీ భూముల గురించీ, కాకినాడ రేవు గురించి సీబీఐతో విచారణ చేయిస్తారేమోననే భయం పుట్టుకొచ్చిందా అందుకే నోరు మెదపడం లేదా అని భూమన ప్రశ్నించారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెల్లడైతే ప్రజలు మిమ్మల్ని మరింత చీదరించుకుంటారనే భయం ఆవహించిందా అని అడిగారు. బొగ్గు కుంభకోణంలో సీబీఐ వ్యవహారశైలిపై మీ పార్టీగానీ, మీరు గానీ ఎందుకు నోరు మెదపడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. 

స్వతంత్ర సంస్థ అని చెప్పుకునే సీబీఐ చంద్రబాబు అనుకూల సంస్థగా మారిపోయిందా, ఆయన ప్రయోజనాలు కాపాడటానికే అది పనిచేస్తోందా అని నిలదీశారు. సీబీఐ ఉన్నతాధికారే అఫిడవిట్ చూపామని చెప్పాక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని ఎలా చెప్పుకుంటారన్నారు. ఇది ప్రజా స్వామ్యాన్ని పరిహసించడం కాదా అని ప్రశ్నించారు. స్వతత్రంగా విచారణ చేపట్టి నిష్పక్షపాతంగా దోషులను శిక్షించే సంస్థ సీబీఐ కాదు అని సుప్రీం కోర్టు సాక్షిగా వెల్లడయ్యిందన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజిత్ సిన్హా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లోని అంశాలను చదవి వినిపించారు. 

చంద్రబాబు నాయుడు నూరుశాతం సీబీఐని అడ్డంపెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదన్నారు. సీబీఐ న్యాయశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పిన మార్పులకు అనుగుణంగా చేసి సుప్రీం కోర్టులో వేసిందని వెల్లడైందన్నారు. దీన్ని ఖండించాల్సిన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడాన్ని ఏమనాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని పెట్టిన ఎన్టీఆర్‌ను విగ్రహంగా మార్చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాబు బతిమాలాడుకుని వెడుతున్నారన్నారు.  ఆయన అంటకాగుతున్న కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టే బాధ్యతను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కరుణాకర్ రెడ్డి స్పష్టంచేశారు.

పార్లమెంటులో మహానేత విగ్రహాన్ని నెలకొల్పాలి :

పదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా, ఐదేళ్ళపాటు అనితర సాధ్యమైన అభివృద్ధిని రాష్ట్రంలో సాధించి చూపిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని కూడా పార్లమెంటులో నెలకొల్పాలని భూమన విజ్ఞప్తిచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన ఓ ప్రశ్నకు బదులు చెప్పారు.

Back to Top