సంతకాల సేకరణకు అనూహ్య స్పందన


హైదరాబాద్, 12 జనవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిపై సీబీఐ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. 'జగన్ కోసం... జనం సంతకం' పేరుతో చేపట్టిన సంతకాల సేకరణ రెండు కోట్లు దాటుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. శ్రీ జగన్మోహనరెడ్డి కేసులో సీబీఐ అనుసరిస్తున్నతీరుకు నిరసనగా సేకరిస్తున్న సంతకాలు శనివారం నాటికి 1.78 కోట్లకు చేరుకున్నాయని, వాటితోపాటు ఒక విజ్ఞాపన లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేయనున్నట్టు పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, రెహమాన్ తెలిపారు.

శ్రీ జగన్మోహనరెడ్డికి మద్దతుగా కోటి సంతకాలు సేకరించాలని తాము భావించామని, అయితే ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఆ సంతకాలు 1.78 కోట్లకు చేరుకున్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో చెప్పారు. సీబీఐ తన సొంత మాన్యువల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అలాగే శ్రీ జగన్మోహనరెడ్డి పట్ల కక్షపూరితంగా దర్యాప్తు కొనసాగిస్తోందన్న ప్రజల అభిప్రాయాలతో కూడిన సంతకాల బాక్సులను రాష్ట్రపతికి పంపించనున్నట్టు తెలిపారు.

సేకరించిన సంతకాలను ఒక సీడీలో చేర్చి రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరికినపుడు వాటిని ఆయనకు అందజేస్తామన్నారు. వివాదాస్పద జీవోలు జారీ చేసిన వారు న్యాయ సహాయం తీసుకోవడమే కాకుండా బయట స్వేచ్చగా తిరుగుతున్నారని, కానీ ఏ తప్పు చేయని శ్రీ జగన్మోహనరెడ్డి మాత్రం ఏడు మాసాలకు పైగా జైలులో ఉన్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వంగానీ, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐగానీ సరైన సమాదానం ఇవ్వడంలేదని వారు ఆరోపించారు.

Back to Top