జగన్ కుప్పం వెళ్తే బాబుకెందుకు హడల్?

హైదరాబాద్, 19 నవంబర్ 2013:‌

'సమైక్యం' అనే మూడు అక్షరాలు పలకడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు సందేహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న నిర్ణయంతో శ్రీ జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తుంటే.. తెలంగాణలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను మూసేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ.. సమైక్యం అని గాని, విభజన అని గాని అనకుండా సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోయి రాష్ట్రంలోనే తన టీడీపీని మూసేసే దశకు తీసుకువెళుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్నా ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు లేదని చంద్రబాబుకూ తెలుసు అని ఆయన విమర్శించారు.

ఈ నెల 27వ తేదీన శ్రీ జగన్మోహన్‌రెడ్డి కుప్పంలో పర్యటనకు వెళ్తున్నారంటే చంద్రబాబుకు ఎందుకంత భయమని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కుప్పం ప్రజలు చంద్రబాబుని చొక్కాపట్టుకుని ప్రశ్నించాలని కోరారు. నిన్న, నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తూ.. శ్రీ జగన్‌ సమావేశానికి ఎవరూ వెళ్ళవద్దని ఆ నియోజకవర్గం ప్రజలకు చెప్పడం రాజకీయంగా ఎంత దిగజారిపోయారో తెలుస్తున్నదన్నారు. శ్రీ జగన్‌ ప్రసంగం వింటే కుప్పంలో తనకు ఓట్లు రావనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. చంద్రబాబు వైఖరిని ప్రశ్నించండి అని ప్రజలకు అంబటి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఇళ్ళ నుంచి బయటికి రావాలని, విభజన విషయంలో వికృత క్రీడకు పాల్పడుతున్న చంద్రబాబు సహా రాజకీయ నాయకులందరినీ చొక్కాపట్టుకుని ప్రశ్నించాలని అన్నారు.

రోజూ ఏదో రకంగా గోబెల్సు ప్రచారం చేసి శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద బురద చల్లడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పదహారు నెలలు జైలులో అక్రమంగా నిర్బంధంలో ఉన్నప్పటికీ‌ సోనియా పట్ల తన వైఖరిని శ్రీ జగన్ సమైక్య శంఖారావం సభలో ఏ విధంగా ప్రకటించిందీ చంద్రబాబు చూడాలన్నారు. 'చంద్రబాబు నిప్పులా ఎప్పుడు బతికారో చెప్పాలని అన్నారు. అందర్నీ మోసం చేసే చంద్రబాబు నిప్పు అవుతారా? అని నిలదీశారు. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.‌ రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటే.. తాను ఇచ్చిన విభజన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడంలేదని ప్రశ్నించారు. విభజన విషయంలో ప్రజలను సందిగ్ధంలో పడేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచమైన ఎత్తుగడలతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌తో కలిసిపోయిన, ఆ పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకున్న వ్యక్తి చంద్రబాబే కాని శ్రీ జగన్‌కు అలాంటి అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయడానికి ముందుకు వెళుతున్న ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీ జగన్‌ వెళ్ళె కాంగ్రెస్‌లో కలిసిపోతారంటూ చంద్రబాబు ‌అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుప్పంలో శ్రీ జగన్‌ బహిరంగ సభ విజయవంతం కావడం ఖాయం, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యం అని, చరిత్ర హీనుడిగా, ఓడిపోయిన నీచుడిగా ఆయన రాజకీయ జీవితం అంతం కావడమూ ఖాయం అని అంబటి అన్నారు. కాంగ్రెస్‌ను ఎన్నోసార్లు కాపాడిన చంద్రబాబు సోనియాకు దొంగపుత్రుడా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై రాంబాబు ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు పైకి గొప్పలు చెప్పుకొంటూ.. లోలోపల మాత్రం విభజనకు సీఎం కిరణ్ కుమా‌‌ర్ రెడ్డి‌ సహకరిస్తు‌న్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిజంగా సమైక్యంగా ఉంచాలనుకుంటే ముందుగానే అసెంబ్లీని సమావేశపరిచి, సమైక్య తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి ఎందుకు పంపించలేదని సీఎం కిరణ్‌ను నిలదీశారు. రాష్ట్ర విభజనకే కిరణ్‌ అనుకూలమని ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. జీఓఎంకు వెళ్ళిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరు కూడా విభజనకు అనుకూలంగానే ఉన్నట్లు వారి చర్యలు, మాటలను బట్టి తెలుస్తోందని అంబటి అన్నారు. కొన్ని పనికిమాలిన పత్రికలు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. అసత్య ప్రచారం చేసే వారికి గుణపాఠం చెప్పే రోజు తప్పకుండా వస్తుందని అంబటి వ్యాఖ్యానించారు.

Back to Top