పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి

హైదరాబాద్, 18 నవంబర్ 2013:

దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, వాటికి పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడంతో పాటు రాష్ట్రంలో 18 ఏళ్ళ వయస్సు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేలా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేసినట్లు రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ తెలిపారు.‌‌ హైదరాబాద్‌లోని ఖాజా మాన్షన్‌ ఫంక్షన్‌ హాలుతో సోమవారం జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం అనంతరం పార్టీ సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తదితరులతో కలిసి కొణతాల మీడియాతో మాట్లాడారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగిందన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమైన సంస్థాగత విషయాలపై కొన్ని సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు.
గడప గడపకూ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, పార్టీని పటిష్టపరచాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేసినట్లు కొణతాల తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇడుపులపాయలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజలందరికీ మరోసారి తెలియచేయాలని నిర్దేశించారన్నారు. డిసెంబర్‌ నెలలోగా జిల్లా, మండల, బూత్‌ స్థాయి పార్టీ కమిటీల నియామకాన్ని పూర్తిచేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఇచ్చినట్లు చెప్పారు. పార్టీని గ్రామ, బూత్‌ స్థాయి నుంచీ ఎలా బలోపేతం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న ప్రధానమైన పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు కొణతాల తెలిపారు. ఆ కార్యక్రమాలకు త్వరలోనే రూపకల్పన చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు చెప్పారు.

రాజకీయ కుట్రకు అవకాశంగా ఉపయోగపడుతున్న ఆర్టికల్ 3ని సవరించాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీ జగన్‌ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళి సీపీఐ, సీపీఎం, బీజేపీ అగ్రనేతలకు వివరించి వచ్చిన వైనాన్ని కొణతాల ప్రస్తావించారు. గతంలో ఏర్పాటైన రాష్ట్రాల విషయంలో అనుసరించిన సంప్రదాయాలను స్వస్తి పలికి, శాసనసభ, ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇవ్వకుండా ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. కోర్టు అనుమతి ఇస్తే.. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నేతల మద్దతును శ్రీ జగన్ కూడగ‌డతారన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్‌ 3పై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. ఇంత వరకూ పార్టీ కన్వీనర్ల వ్యవస్థ మీదే ఆధారపడి నడుస్తోందని, ఇక నుంచి ప్రతి కార్యకర్తకూ పదవి, బాధ్యతలు అప్పగించాలని ఆలోచించినట్లు చెప్పారు. ఆ క్రమంలోనే బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయనున్నట్లు వివరించారు. వైయస్ఆర్‌‌ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే మాట మీద ఉన్నారన్నారు. ఇతర పార్టీల మాదిరిగా ద్వంద్వ విధానాలతో వ్యవహరించడంలేదన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల మేరకు ఏర్పాటైన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అదే విధానంలో కొనసాగాలని తమ అందరి ధ్యేయం అన్నారు.

Back to Top