కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తాం


హైదరాబాద్, 28 డిసెంబర్ 2012: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధిలేని పార్టీలు, నేతలు విమర్శిస్తున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఇద్దరు నేతలను పంపించి భిన్న వాదనలు వినిపించిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు తమపై అక్కసును వెళ్లగక్కుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నందుకే విమర్శిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశామన్నారు.

     అధికారంలో ఉన్న కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ తమ అభిప్రాయాలను అఖిలపక్ష సమావేశంలో చెప్పాయని బాజిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ రావు, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్ధన్ రెడ్డి, మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి బాబు మాట్లాడారు. భిన్నాభిప్రాయాలు చెప్పిన కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన ఆ పార్టీ ఎంపీలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని బాజిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ద్రోహిగా అభివర్ణించిన కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కియే తెలంగాణకు ద్రోహి అన్నారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణపై నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మధుయాష్కి ఊడిగం చేస్తున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు జోకర్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

     రాయలసీమలో జై తెలంగాణ నినాదాలు చేసిన ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని బాజిరెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి నినాదాలు చేసే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి కాంగ్రెస్ విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాగా తాము మాటలు మార్చబోమన్నారు. ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీలో ఇచ్చిన మాటకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారన్నారు.

     తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినందుకే రాజీనామా చేసిన నేతలపై గతంలో పోటీ పెట్టలేదని, ఈ విషయం మరచిపోయి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, ఆ పార్టీ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాజిరెడ్డి ఆరోపించారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నకేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.

     ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది తెలంగాణ అంటూ గడువులు విధించిన కేసీఆర్ మరోసారి ప్రజలను మోసగిస్తున్నారని జనక్ ప్రసాద్ ఆరోపించారు. అనేక దఫాలుగా మోసగిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించాల్సిన కేసీఆర్ తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు గానీ, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ప్రశ్నించే ధైర్యం లేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రెండు కళ్ల సిద్దాంతాన్ని అనుసరించే టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

     నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నషిండే మాట నిలుపుకుంటే హర్షిస్తామని, లేకుంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతారని నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. స్పష్టమైన వైఖరి వెల్లడించని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా తమపై బురదజల్లే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని జనార్ధన్ రెడ్డి సూచించారు. ప్రజల అభిష్టం మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడచుకుంటుందని ఆయన అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top