ట్రిబ్యునల్‌ తీర్పుతో ఏపీకి తీరని నష్టం

హైదరాబాద్, 29 నవంబర్ 2013:

కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పును సవరించకపోతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించి, ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ‌తేవాలని సూచించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పు అనంతరం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సవరించలేకపోయారని, పాత తీర్పునే మరోసారి ఇచ్చారు తప్ప మార్పేమీ లేదని మైసూరారెడ్డి విచారం వ్యక్తంచేశారు. కాకపోతే రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్)కు 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలోనే కృష్ణానదిపై అక్రమ నిర్మాణాలు జరిగాయని మైసూరారెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా డెల్టా రైతులను మెట్ట పంటల వైపు మళ్ళించాలని చంద్రబాబు నాయుడు ఆనాడే చెప్పారన్నారు. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై ట్రిబ్యునల్ ఎదుట‌ మన రాష్ట్రం తీవ్రస్థాయిలో ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు‌ ఇచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top