అన్ని రంగాల్లోనూ కిరణ్ ‌ప్రభుత్వం విఫలం

మహబూబ్‌నగర్‌, 24 నవంబర్‌ 2012: కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. జగన్‌ తరఫున మరో ప్రజాప్రస్థానం చేస్తున్న షర్మిల 38 రోజు పాదయాత్ర సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జూలకల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

పేదలకు రేషన్ సరకులు సక్రమంగా అందడంలేదని షర్మిల ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పేదలకు ఇళ్లు మంజూరు కావడంలేదని ఆరోపించారు. జగనన్న సీఎం అయితే పేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు 700 రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ అందిస్తారని షర్మిల హామీ ఇచ్చారు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారన్నారు. రాజన్న రాజ్యంలో ఉచితంగా విద్యుత్‌ అందుతుందన్నారు. రాజన్న రాజ్యం వస్తే మహిళలకు పావలా వడ్డీ రుణాలు సకాలంలో సక్రమంగా అందుతాయని షర్మిల హామీ ఇచ్చారు. ప్రజలకు తాగునీరు అందడంలేదని, ఇందిరమ్మ గృహాలు రావడంలేదని షర్మిల వద్ద జూలకల్ గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు.

శనివారంనాడు 38వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసే సమయానికి షర్మిల మొత్తం 508.4 కిలోమీటర్లు నడిచారు. షర్మిల పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు భాగస్వాములవుతున్నారు. ఉదయం జిల్లాలోని బూడిదపాడు క్రాస్‌ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం శాంతినగర్, 26వ కాల్వ, కొంకల, పెదతాండ్ర క్రాస్ రో‌డ్, వెంకటాపురం స్టేజీ వరకు యాత్ర కొనసా‌గింది. రాత్రికి వెంకటాపురం స్టేజీ నుంచి కిలోమీటర్‌ దూరం నడిచిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గుడారంలో షర్మిల బస చేస్తారు. షర్మిల శనివారం మొత్తం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Back to Top