స‌రికొత్త చ‌రిత్ర‌కారుడు- సడలని సంక‌ల్పంతో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 300 రోజులు 
-  కుట్రలను ఛేదించుకుంటూ ముందుకే సాగుతున్న వైనం
- హ‌త్యాయ‌త్నం జ‌రిగినా  చెక్కుచెదరని సంకల్పం
- అణగదొక్కే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో బలోపేతం 

విజ‌య‌న‌గ‌రం: ఎవరికీ తలవంచని ధైర్యం..కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. మేరువు లాంటి తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైయ‌స్‌ జగన్‌ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. దేశ చ‌రిత్ర‌లోనే ఏ నాయ‌కుడు ప్ర‌జ‌ల కోసం ఇంత‌గా పాద‌యాత్ర చేసిన ఘ‌ట‌న‌ లేదు. ఏడాదికి పైగా జ‌నం మ‌ధ్య‌లోనే ఉంటూ..త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగినా..జ‌నం కోసం చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు త‌పించాల‌నే స‌డ‌ల‌ని సంక‌ల్పంతో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌గా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో ముందుకు సాగుతున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రేప‌టికి 300 రోజుల‌కు చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ పాద‌యాత్ర‌తో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని వారికి రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

కుట్ర‌లు అన్నీ  ఇన్నీ కాదు..
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్  రాజశేఖరరెడ్డి మరణించిన క్షణం నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గత తొమ్మిదేళ్లుగా జరిగిన కుట్రలు అన్నీఇన్నీ కావు. రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నెన్నో. మహానేత అయిన తండ్రి మరణం జగన్‌కు రాజకీయంగా తొలి దెబ్బ అయితే.. భౌతికంగా తననే అంతం చేయాలని తాజాగా జరిగిన కుట్ర మలి దెబ్బ. ఈ రెండింటికీ మధ్య ఆయన కుట్రదారుల నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. నిరంకుశ కాంగ్రెస్‌ నేతలతో రాజీపడనందుకే వైయ‌స్‌ జగన్‌ ఆర్థిక మూలాలనే దారుణంగా దెబ్బతీయాలనే కుట్ర జరిగింది. ఇదే క్రమంలో ఆయనపై అనేకానేక నిరాధారమైన ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి పదహారు నెలలపాటు జైలుపాల్జేశారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్‌ జైల్లో ఉన్న 16 నెలల కాలం మినహా మిగతా సమయమంతా జనం మధ్యనే ఉంటూ వచ్చారు. తనను అణగదొక్కాలని, రాజకీయ ముఖ చిత్రంలోనే లేకుండా చేయాలని వ్యతిరేక శక్తులు అనేకానేక కుట్రలు పన్నినా ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతోనే ఆయన ప్రజాక్షేత్రంలో ఎదురొడ్డి పోరాడుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఇంత సుదీర్ఘకాలం పాటు పోరాట మార్గంలో సాగిన రాజకీయవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో.    

ఎన్ని అడ్డంకులు సృష్టించినా..
న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌జ‌ల్లో కొత్త వెలుగులు నింపేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలు నెరవేరక కష్టాల్లో కునారిల్లుతున్న ప్రజలను కలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు నవరత్నాలు కార్యక్రమం అమలు ఆలంబనగా 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. చట్టం పేరు చెప్పి దీనికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినా వెరవకుండా ముందుకే సాగారు. ఆయనపై చేసిన కుట్రలు సాగలేదన్న దుగ్ధతో ఇక భౌతికంగానే అంతం చేయాలన్న దుస్సాహసానికి ఇటీవల తెగబడిన విషయం తెలిసిందే.  

అలుపెర‌గ‌ని యాత్ర‌
‘రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో.. సీఎం చంద్రబాబునాయుడు తీరుతో పూర్తిగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇస్తూ ముందడుగు వేస్తున్నా’.. అంటూ వైయ‌స్ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయ వద్ద 2017 నవంబరు 6న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఆదివారంతో 300 రోజుల‌కు చేరుకుంటుంది. ఈ 12నెలల కాలంలో జగన్‌ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలో యాత్రను కొనసాగిస్తూ జనంతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడంలోనూ.. ప్రజలను కలుసుకోవడంలోనూ ఆయన చూపుతున్న చొరవ ప్రదర్శిస్తున్న ఓర్పు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులకు భయపడే ప్రసక్తి లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. అది నేను చనిపోయిన తరువాతా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి, ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పంచాలన్నదే నా కసి, ఆ కసి నాలో ఉంది కాబట్టే ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే నా కసి’.. అని పాదయాత్ర తొలి రోజున వ్యక్తీకరించిన సంకల్పం అడుగడుగునా ప్రస్ఫుటిస్తోంది.

వైఎస్సార్‌ జిల్లాలో ప్రారంభమైన యాత్రను కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ముగించుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25న హైదరాబాద్‌కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీని నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ భుజానికి లోతైన గాయం కావడంతో జగన్‌ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి ఈ నెల 12న పాద‌యాత్ర పునఃప్రారంభ‌మైంది.  ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ..ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిల‌బ‌డి రాజ‌న్న బిడ్డ‌ను ఆద‌రిస్తున్నారు. అన్నా..రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తున్నారు.ఇది కాదా స‌రికొత్త చ‌రిత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్ స‌రికొత్త చ‌రిత్రకారుడు అన‌డంలో అతిశ‌యోక్తి లేదేమో!
Back to Top