వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్‌సీపీ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరులో విలువైన ప్రభుత్వ భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో 9.68 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే, ఆయన తనయుడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. తాను గతంలో చేసిన ఆరోపణలు నిజమేనని కొండారెడ్డి స్వయంగా ధృవీకరించారని రాచమల్లు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అంగీకరించినందుకు కొండారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అయితే, రూ.2.50 కోట్ల డబ్బు తమ వద్ద నుంచి తీసుకున్న విషయాన్ని కూడా నిజాయితీగా ఒప్పుకుని ఉంటే మరింత అభినందించేవాడినని ఎద్దేవా చేశారు. ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని అంగీకరించడం ద్వారా అసలు నిజాలు బయటపడ్డాయని రాచమల్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూమిని ఇతరుల పేర్లపై విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నిజాయితీ గురించి మాట్లాడే నాయకులకు ఈ వ్యవహారాలు తెలియవా అని ప్రశ్నించిన రాచమల్లు, కొండారెడ్డి చేస్తున్న పనులపై వరదరాజులరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.