వైయస్ హయాంలో అందరికీ లబ్ధి‌ : ఉప్పునూతల

భువనగిరి (నల్గొండ జిల్లా), 1 సెప్టెంబర్‌ 2012 : రాష్ట్రంలో జన బలం ఉన్న నాయకుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు వంద టిక్కెట్లు ఇవ్వడం కాదని, వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రతిపాదించిన విధంగా అసెంబ్లీలో వంద మంది బీసీలను కూర్చోబెట్టాలని రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అందరూ లబ్ధి పొందారని అన్నారు. వైయస్‌ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని వర్గాలకూ మేలు చేకూర్చాయని పేర్కొన్నారు. భువనగిరిలో శనివారం ఆయన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రిగా పనిచేసిన అనుభవం లేదన్నారు. ఎకాయెకిన ముఖ్యమంత్రి కావడం వల్లే ఆయనకు ప్రజల సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అనుభవ రాహిత్యం కారణంగానే రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని ఉప్పునూతల దుయ్యబట్టారు.

ఈ నెల 9న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన తాను కార్యకర్తల సమావేశం నిర్వహించి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాను కాంగ్రెస్‌పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఉప్పునూతల గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. పార్టీలో సీనియర్‌ సభ్యుడైన తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం రగిలిపోతున్నారు.

Back to Top