ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత పోరాటం

  • 10న అనంతలో యువభేరి సదస్సు
  • హోదాకు తూట్లు పొడిచిన బాబు
  • యువతకు అండగా  వైయస్ జగన్ 
  • హోదా కోసం మూడున్నరేళ్లుగా అలుపెరగని పోరాటం
ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్సార్సీపీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తోంది. ప్రత్యేక హోదాను సాధించుకోవాలనే సంకల్పంతో మరోసారి యువభేరి మోగిస్తున్నారు ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదాను సాధించేందుకు తమ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు మరోసారి యువశంఖారావం పూరిస్తున్నారు జననేత వైయస్ జగన్.  విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. ఎన్నికలకు ముందు ఏపీని అన్నివిధాలా ఆదుకుంటానని, మేం అధికారంలోకి వచ్చాక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చిన ప్రస్తుత పాలకులు ప్రజలను దారుణంగా మోసం చేశారు.  హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజానికానికి వెన్నుపోటు పొడిచాడు. హోదాతో ఏం లాభం అంటూ వెటకారం చేయడం మూలంగా కేంద్రం పట్టించుకోవడమే మానేసింది. ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ అంటూ మాట మార్చింది. ప్రత్యేక హోదాకు కేంద్రాన్ని ఒప్పించింది నేనే అని కోతలు కోసిన చంద్రబాబు, ప్యాకేజీ అనగానే తలూపేశాడు. హోదా ఏమైనా సంజీవనా?హోదా వస్తేనే రాష్ట్రం స్వర్గమవుతుందా అంటూ అలవాటుగా మాట మార్చేశాడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరం అని వైయస్సార్ కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేస్తోంది. ప్రజల ఆంకాంక్షల రూపమైన ప్రత్యేక హోదాపై గళం విప్పడానికి, ప్రత్యేక హోదాకై పోరాడటానికి జగన్ నేతృత్వంలో సన్నద్ధమయ్యింది ఆంధ్ర రాష్ట్ర యువత. 

అక్టోబర్ 10 అనంతపురం నుంచి యువభేరి జరగనుందని రాష్ట్ర యువత హోదాకై ఒక్కటై కదలాలని పిలుపునిచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంద్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక హోదాను సాధించుకోవాలనే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందే ఉంది. రాష్ట్రప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు సృష్టిస్తున్నా హోదాపై తన పంథాను ప్రజలకు వివరిస్తూనే ఉంది. మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన్ను కలిసి ఎపికి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల హోదా ఆశలను కేంద్రానికి తెలియచేస్తూ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. అంతే కాదు దేశ రాజధానికి వెళ్లిన ప్రతిసందర్భంలోనూ ప్రత్యేక హోదాపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు విపక్ష నేత. వినతి పత్రాలు ఇవ్వడంతోపాటు, జాతీయ స్థాయిలో నాయకులను కలిసి హోదా అవసరాన్ని వారికి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. అసెంబ్లీలోనూ ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రతిపక్ష నేత. రాష్ట్రప్రజల ప్రయోజనాలకు వరప్రదాయని లాంటి ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అవ్వడాన్ని ప్రజల ముందు స్పష్టంగా బయటపెట్టారు. హోదా అక్కర్లేదనే టిడిపి ప్రభుత్వ కుట్రపై ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలియజేసేందుకు నిరాహారదీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వం దాన్ని మధ్యలో భగ్నం చేసినా నిరంతరం ప్రత్యేక హోదా గురించి పోరాటాన్ని మాత్రం వీడలేదు ప్రతిపక్షనేత. ప్రత్యేక హోదా రాలేదని ఆత్మహత్య చేసుకున్న ముని కోటి కుటుంబాన్ని పరామర్శించడమే కాదు… హోదాకోసం మరికొందరు బలిదానాలకు సిద్ధమవడం చూసి చలించిపోయారు. రాష్ట్రం అంతా ఏకమై ఒక్కమాటపై నిలబడి హోదాని సాధించుకుందాం… అందుకు బలిదానాలు చేయొద్దని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేకహోదా వల్లే కలిగే మేలును వివరిస్తూ యువతను చైతన్యపరుస్తున్నారు. హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుందని, అప్పుడు ఎక్కడ టూలెట్ బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉండదని వివరిస్తున్నారు. పెట్టుబడుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదని...హోదా ఉంటే మన దగ్గరికే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తారని యువతను మేల్కొలొపుతున్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివారికి నెలకు రూ.2వేలు భృతి ఇస్తానన్నాడు. ఇంతవరకు అతీగతి లేదు. ఫీజు రియంబర్స్ మెంట్ ను నిర్వీర్యం చేశారు.  రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమవుతుందని ప్రతీ ఒక్కరిని వైయస్ జగన్ మేల్కొలుపుతున్నారు. ఇందుకోసం మొక్కవోని దీక్షతో మూడున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. దీక్షలు, ధర్నాలు, బంద్ లు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యువభేరి సదస్సుల ద్వారా యువతను చైతన్యపరుస్తున్నారు. 

యువభేరి సదస్సులుః
15 సెప్టెంబర్ 2015-తిరుపతిలో యువభేరి
22 సెప్టెంబర్ 2015-విశాఖలో యువభేరి
27 జనవరి 2016- కాకినాడలో యువభేరి
2 ఫిబ్రవరి 2016-శ్రీకాకుళంలో యువభేరి
4 ఆగష్టు 2016- నెల్లూరులో యువభేరి
22 సెప్టెంబర్ 2016-ఏలూరులో యువభేరి
25 అక్టోబర్ 2016-కర్నూలులో యువభేరి
19 డిసెంబర్ 2016-విజయనగరంలో యువభేరి
16 ఫిబ్రవరి 2017-గుంటూరులో యువభేరి
10 అనంతపురం 2017-అనంతపురంలో యువభేరి చేపట్టబోతున్నారు.
 
యువభేరీలతో ప్రజల్లో ఉన్న ప్రత్యేక హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించేలా చేశారు. కోట్లమంది ఆశల ప్రతిరూపం, తెలుగు యువతకు బంగారు భవితవ్యం ఇచ్చే ప్రత్యేక హోదాను సాధించుకోవాలనే సంకల్పాన్ని సడలిపోకుండా ముందుకు తీసుకెళుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. వైయస్ జగన్ కు మద్ధతుగా, హోదాపై నోరువిప్పకుండా రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగు యువత నడుం కట్టింది. ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు సిద్ధం అవుతోంది. 
Back to Top