సభను అక్రమాల వేదికగా మారుస్తున్న బాబు



అసెంబ్లీ రూల్స్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వర్తించవా
11 రోజుల్లో 22 బిల్స్‌ పాస్‌ చేసిన చంద్రబాబు
కేంద్రం చేసిన చట్టాన్ని వక్రీకరిస్తున్న టీడీపీ సర్కార్‌
గవర్నర్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు
బాబు దుర్మార్గాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
ప్రజలకు చట్టాలు, రాజ్యాంగంపై విశ్వాసం కలిగించాలి
హైదరాబాద్‌: చంద్రబాబు ప్రతిపక్షం లేకుండా శాసనసభ నడుపుతూ.. సభను అక్రమమైన పనులు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రతిపక్షం సభను బైకాట్‌ చేస్తే వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా తిట్టేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ధర్మాన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ రూల్స్‌ ప్రకారం ఎన్నికైన పార్టీ సభ్యులకు ఒక సీటు కేటాయిస్తారని, వారు స్పీకర్‌ కేటాయించిన సీటు నుంచే మాట్లాడాలన్నారు. కానీ ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన సీట్లలో కాకుండా.. టీడీపీ సభ్యుల స్థానాల్లో కూర్చుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకో సీటు నుంచి మాట్లాడతే.. అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్‌ ఇప్పుడు ఫిరాయింపుదారులు కూర్చుంటే ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీశారు. దీనికి రూల్స్‌ అంగీకరిస్తున్నాయా అని ప్రశ్నించారు. 

చంద్రబాబు ప్రతిపక్షాన్ని సభకు రప్పించే ప్రయత్నం చేయకుండా సభను అక్రమాలకు వేదికగా మార్చుకుంటున్నాడని ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ఉంటే 3 రోజులు మాత్రమే సభ నడిపే చంద్రబాబు ఇప్పుడెందుకు 11 రోజులు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోతే పాలకపక్షం ఎంత ఘోరాలు చేస్తుందో రాష్ట్ర పౌరులంతా ఆలోచించాలన్నారు. ప్రతిపక్షం లేకుండా 11 రోజుల్లో 22 బిల్స్‌ను పాస్‌ చేశారన్నారు. దేశ చట్టాలు, రాజ్యాంగాలు తమకేమీ పట్టనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భూమిపోయి ఉపాధి కోల్పోయిన రైతులకు కేంద్రం చేసిన ఫెయిర్‌ క్యాంపియన్‌ చట్టాన్ని తీసేసి అక్రమ చట్టాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దేశం ఆమోదించిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం గౌరవించదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

స్పీకర్, గవర్నర్‌ వ్యవస్థను చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేస్తున్నాడని ధర్మాన ఆరోపించారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న గవర్నర్‌ చేత ఫిరాయింపుదారులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. సభలో టీడీపీ సభ్యులే ప్రశ్నలు వేసుకోవడం.. వారే జవాబులు చెప్పడం.. ఎవరైనా ప్రజాసమస్యలను ప్రస్తావనకు తెచ్చారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలంతా తలవంచుకునే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు దుర్మార్గాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని చట్టాలు, రాజ్యాంగం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు. 



Back to Top