వాల్మీకి, కొమురం భీం మనకు ఆదర్శం

హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

మహా పురుషులు వాల్మీకి, కొమురం భీం లాంటి వ్యక్తుల జీవితాన్ని, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయకీయ వ్యవహారాల కమిటి కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ అన్నారు. గిరిజన తెగల కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు కొమురం భీం వర్ధంతిని, ఆటవికుడిగా జీవితాన్ని ప్రారంభించి, పరివర్తనతో మహా పురుషుడిగా మారిన వ్యక్తిగా వాల్మీకి జయంతిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. వాల్మీకి రామాయణం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయేలా వాల్మీకి రాశాడని పార్టీ పిఎసి కో ఆర్డినేటర్ కొణతాల‌ రామకృష్ణ ప్రశంసించారు. ప్రకృతి ద్వారా ఏ వ్యక్తి అయినా ఎలా మార్పు చెందగలుగుతాడు, మహాపురుషునిగా ఎలా మారతాడు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ వాల్మీకి అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో గిరిజన తెగల గురించి ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడని కొణతాల కొనియాడారు. బ్రిటిష్‌ సాయుధ దళాలకు ఎదురొడ్డి పోరాడాడని ప్రశంసించారు. కొమురం భీం ఇప్పటికీ ఆదర్శ పురుషునిగా గిరిజన తెగల గుండెల్లో నిలిచి ఉన్నారన్నారు. అంతకు ముందు వాల్మీకి, కొమురం భీం చిత్రపటాలకు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శోభా నాగిరెడ్డి, విజయచందర్, గట్టు రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top