పాదయాత్రకు సెక్యూరిటీ కల్పించాలి

  • డీజీపీని కలిసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు
  • జననేతకు జెడ్‌ క్యాటగిరి ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ
  • ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే పాదయాత్ర
  • పోలీసుల దౌర్జన్యాలను అరికట్టాలని వినతి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
మంగళగిరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పం’ పాదయాత్రకు బందోబస్తు కల్పించాలని పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీ సాంబశివరావును కలిశారు. వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారధి, జోగి రమేష్‌లు డీజీపీని కలిసి పాదయాత్రకు సంబంధించిన వివరాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ నెల 6వ తేదీ నుంచి ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. పాదయాత్ర సమయంలో జరిగే సభలు, సమావేశాలపై డీజీపీతో చర్చించామన్నారు. పాదయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా సెక్యూరిటీ కల్పించాలని కోరామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన డీజీపీ తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడకు వెళ్తున్నారో రెండు రోజుల ముందే జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. అదే విధంగా జననేతకు జెడ్‌ క్యాటగిరిని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, తప్పకుండా ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు.

బాబు విదేశీ పర్యటనలతో ప్రజాధనం దుర్వినియోగం..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ఒత్తిడి తీసుకువచ్చేందుకే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని బొత్స సత్యనారాయణ వివరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలు అన్నింటిని వివరించనున్నారన్నారు. ఈ మధ్య జరిగిన దసరా, దీపావళి పండుగలకు పేదవాడికి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయన కోటరీ వారి సోకుల కోసం రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పాదయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ తెలుసుకోనున్నారన్నారు. 

వారిపై చర్యలు తీసుకోవాలి...
శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని డీజీపీకి వివరించడం జరిగిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిలపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు. 
Back to Top