ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఆరోపణలు



కళా వెంకట్రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మజ్జి శ్రీనివాసరావు
నమ్మి ఓటేసిన ప్రజలను జంతువులతో పోల్చుతారా..?
ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదు
శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి కళావెంకట్రావు చేసిన వ్యాఖ్యలను మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ పాదయాత్ర సర్కస్‌ కంపెనీలా ఉందని కళా వెంకట్రావు మాట్లాడాడని, శ్రీకాకుళం జిల్లా ప్రజలు జంతువుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను జంతువులతో పోల్చుతారా అని విరుచుకుపడ్డారు. ఇదేనా ప్రజలకు మీరిచ్చే గౌరవం అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో కళా వెంకట్రావుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసి ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని, అవాకులు పేలితే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజా సంకల్పయాత్రకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి జననేతకు సమస్యలు చెబుతున్నారన్నారు.
నాలుగున్నరేళ్లలో తోటపల్లిని పట్టించుకోలేదు..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2014లో తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించారని మజ్జి శ్రీనివాసరావు గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ టెండర్లు పిలిచి పనులు చేపట్టారని, తోటపల్లి ప్రాజెక్టు దాదాపు 90 శాతం పూర్తయిందన్నారు. నాలుగున్నరేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఎట్చర్ల నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే 10 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వం ఉందన్నారు. 
Back to Top