ప్రజలకు ఎంత మేలు చేశామనేదే ముఖ్యం

ఐదేళ్ల పాలనలో 7 లక్షల ఎకరాలు పంచిన వైయస్‌ఆర్‌
13 ఏళ్ల పరిపాలనలో 13 వందల ఎకరాలైనా పంచావా బాబూ
వ్యవసాయం దండగ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు
వైయస్‌ఆర్‌ పాదయాత్రలో చూసిన సంఘటనలే.. ఆయన పాలన
వృద్ధురాలిని చూసి చలించి 70 లక్షల మందికి పెన్షన్లు
బాబు పీడ ఎప్పుడు వదులుతుందని ప్రజలు భావిస్తున్నారు
ఫిరాయింపుదారులకు ప్రజలు బుద్ధి చెబుతారు
వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమం గొప్ప సంస్కారం
ఆత్మకూరు: ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నామని కాదు.. ప్రజలకు ఎంత మేలు చేశామనే ఆలోచన ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు సూచించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్రాన్ని పాలించి 7 లక్షల ఎకరాల భూపంపిణీ చేశారని చంద్రబాబు కనీసం ముఖ్యమంత్రిగా కొనసాగిన 13 సంవత్సరాల కాలంలో 13 వందల ఎకరాలైన నిరుపేద రైతులకు పంచాడా అని ప్రశ్నించారు. ఆత్మకూరు సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్ద మహానేత వైయస్‌ఆర్‌ను తలచుకుంటూ వైయస్‌ఆర్‌ గంగాహారతి కార్యక్రమం చేపట్టడం సంస్కారంగా అనిపించిందన్నారు. రాష్ట్రంలో రైతు ప్రయోజనాలను రక్షించడానికి, వాటి కోసం పనిచేయడానికి దీక్షపూనిన నాయకుడి ప్రయత్నాలన్నీ ఫలించిన రోజు మళ్లీ ఈ ప్రాంత రైతులు అతన్ని స్మరించుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని నివాళులర్పిస్తే అది గొప్ప సంస్కారమన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ప్రభుత్వం రైతుకు అండగా ఉండాలనేది వైయస్‌ఆర్‌ మాట..
2003లో విపరీతమైన కరువు సంభవించింది. రైతులు ఆత్మహత్యలు పొలాల్లో కొట్టేందుకు తెచ్చిన మందును వారు తాగి ఆత్మహత్య చేసుకుంటుండే వారు.. అలాగే పొలంలో ఉండే చెట్లకు ఉరివేసుకొని చనిపోయిన సంఘటనలు పేపర్లో విపరీతంగా కనిపించేవి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఎవరూ తోడు లేనప్పుడు ప్రభుత్వం నేనున్నాననే ధైర్యం చెప్పాలని అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యవసాయం దండగ అనే మాటను శాసనసభ సాక్షిగా చెప్పారు. రైతుకు ప్రభుత్వం నేనున్నాననే ధైర్యం ఇవ్వాలనేది వైయస్‌ఆర్‌ అభిమతం. శాసనసభలో అనేకసార్లు వైయస్‌ఆర్‌ చంద్రబాబును నిలదీసినా ఫలితం కనిపించలేదు. అప్పుడే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలను కులుసుకుని ఓదార్చేందుకు, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రజా ప్రస్థానం పేరుతో 1675 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర కనిపించిన సంఘటనలే వైయస్‌ఆర్‌ పాలన. పాదయాత్రలో ఓ వృద్ధురాలు వైయస్‌ఆర్‌ను కలిసి వారం రోజులుగా తిండి లేదు. కాళ్లు వణుకుతున్నాయి. కంటి చూపులేదు.. టీ అయినా తాగుతా.. పెన్షన్‌ ఇప్పించండి అని చెప్పడంతో ఆ ముసలవ్వ సంఘటన ఆధారంగా 70 లక్షల మందికి రూ. 2 వందల పెన్షన్‌ ఇప్పించారు. 
డ్రామా ఆడి వెళ్లిపోతుంటే గొప్ప కోపమొస్తుంది..
వైయస్‌ఆర్‌ చేపట్టిన ప్రాజెక్టుల దగ్గరకు చంద్రబాబు వచ్చి ఒక డ్రామా ఆడి వెల్లిపోతుంటే మహాగొప్ప కోపం వస్తుంది. పోలవరంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముందుచూపుతో ఆలోచించి వైయస్‌ఆర్‌ అందుకు అన్ని అనుమతులు తీసుకొని కాల్వ నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేశారు. విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే కమీషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు డబ్బులన్నీ దండుకొని ఇప్పుడు చేతులెత్తేశాడు. ఒక సందర్భాన్ని తనకు అనుకూలంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకునే వ్యక్తి చంద్రబాబు. రైతు మొహంలో సంతోషం చూసేందుకు నిరంతరం వైయస్‌ఆర్‌ కృషి చేశారు. అందుకే దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా.. ఏ రాష్ట్ర ప్రజలైనా.. వైయస్‌ఆర్‌ లాంటి ముఖ్యమంత్రి కావాలనే విధంగా పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నామని కాదు.. ప్రజలు మేలు చేయాలనే భావన ఉండాలని చంద్రబాబూ. గత 9 ఏళ్ల చంద్రబాబు పాలన, ప్రస్తుత నాలుగేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారు. ఈ పీడ ఎప్పటి వదులుతుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన సాగుతుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇచ్చిన బీఫామ్‌తో గెలిచిన వారంతా డబ్బులకు ఆశపడి టీడీపీలో చేరారు. వారి డబ్బులు మిగలొచ్చు గానీ ప్రజల వద్ద పరపతి కోల్పోయారు. ఎన్నికల్లో వారి అంతు ప్రజలే చూస్తారు. 
 
Back to Top