వైయస్ఆర్ పాలనను చూసి నేర్చుకో

చంద్రబాబుకు పరిపాలించడం చేతగాకపోతే దివంగత నేత వైయస్‌ఆర్‌ పాలనను చూసి నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం సూచించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే అసలు ఏపీలో ప్రభుత్వమనేది ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు రైల్వేజోన్‌ కోసం అమర్‌నాథ్‌ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలతోనే విశాఖకు రైల్వేజోన్‌ వచ్చి తీరుందని స్పష్టం చేశారు. రైల్వే ఉద్యోగాల కోసం ఏపీ యువత భువనేశ్వర్‌కు వెళితే అక్కడివారు వెంటాడి కొడుతున్నారని ఇవన్నీ చంద్రబాబుకు చెవులుండి వినిపించడం లేదా.. లేక కళ్లుండి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో కబుర్లు చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుకైనా వేశారా అని నిలదీశారు. అమరావతిని ఏ విధంగా కట్టాలనుకుంటున్నారో నీకైనా స్పష్టమైన ఆలోచన ఉందా అని బాబుకు చురకంటించారు. ఏపీ హక్కుల సాధన కోసం ప్రజానీకం వెన్నుచూపకుండా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్రను ప్రగతి పథంలో నడిపించేందుకు శ్రీకాకుళం జిల్లా కూడా కదలివస్తుందని భరోసా కల్పించారు. 

Back to Top