నీటి దోపిడీపై వైయస్ జగన్ పోరాటం

కర్నూలుః టీడీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అక్రమ కట్టడాలపై బాబు ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. చంద్రబాబు కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జలదీక్షకు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకం కదలిరావాలని పిలుపునిచ్చారు. 

అంబటి రాంబాబు:
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా, గోదావరి జలాలను తోడుకుంటున్నా...ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ చట్టవ్యతిరేక పద్ధతిలో వెళ్తున్నా అధికార టీడీపీ ఏమాత్రం అడ్డుకోకపోవడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో చంద్రబాబు అటు కేంద్రంతో గానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంపై ఒత్తిడి తేలేకపోవడం దారుణమన్నారు.  చంద్రబాబు నిర్వాకం కారణంగా  రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు. టీడీపీ సర్కార్ అలసత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వం దోపిడీని అడ్డుకునేందుకే వైయస్ జగన్ దీక్ష చేపట్టడం జరిగిందని అంబటి స్పష్టం చేశారు.  

విశ్వేశ్వర్ రెడ్డి:
తెలంగాణ నిర్మించనున్న ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ లకు ప్రధాన నీటివనరు కృష్ణా అని చెప్పారు.  శ్రీశైలం జలాయశంలో 870 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్ట్ లకు నీరు అందే పరిస్థితి ఉంటుందని చెప్పారు. కానీ 810 అడుగులు ఉండగానే తెలంగాణ సర్కార్ నీటిని పంపింగ్ చేయడం  మొదలుపెడితే రాయలసీమ దారుణంగా నష్టపోతుందన్నారు. ఇక్కడి ప్రాజెక్ట్ లకు  నీరందాలంటే తెలంగాణ అక్రమ కట్టడాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఇందుకోసం రాష్ట్రమంతా సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ను ఎండగట్టేందుకు వైయస్ జగన్ చేపట్టిన ఈదీక్షకు రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతుగా నిలవాలన్నారు. 

ఎం.వి.ఎస్.నాగిరెడ్డి:
2004 దాకా బాబు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని, పైగా ఆయన హయాంలో  పై రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్ట్ లతో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రాన్నికర్నాటక, మహారాష్ట్రకు తాకట్టుపెట్టాడు, ఇవాళ తెలంగాణకు తాకట్టు పెడుతున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీకి తాగునీరు కూడా లేకుండా చేస్తున్నారని, తెలంగాణ సర్కార్ ప్రాజెక్ట్ లు కడితే భవిష్యత్తులో రాష్ట్రం  బీడుగా మారుతుందన్నారు. దీన్ని ఏపీలోని అన్ని రైతు సంఘాలు, ప్రజలు గుర్తించినా బాబు మాత్రం కళ్లు తెరవడం లేదని దుయ్యబట్టారు. ఏపీలో 8 జిల్లాలు, పశ్చిమగోదావరిలో లక్షన్నర ఎకరాలకు కృష్ణా జలాలే ఆధారమని  నాగిరెడ్డి చెప్పారు.  వైయస్ జగన్ దీక్షను విమర్శించి బాబు దగ్గర లబ్ది పొందేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు.  అన్ని ప్రాంతాలకు న్యాయం జరగకపోతే గ్రామాలకు గ్రామాలు వలసలు పోయేపరిస్థితి వస్తుందన్నారు.  తాగునీరు, సాగునీరు అందించడం ప్రభుత్వం బాధ్యత అని, ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకోవాలన్నారు. 

సునీల్ కుమార్:
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ ల వల్ల రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారనున్నాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన దీక్షకు రైతులంతా మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కదలిరావాలని పిలుపునిచ్చారు. 

Back to Top