ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్దు

 
 


 హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లా నక్కపల్లిలో త్రినాథ్‌ ప్రాణత్యాగానికి పాల్పడటంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ  ప్రతిపక్ష నేత వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. త్రినాథ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన లక్ష్యం కోసం పోరాడుదామని, ఆత్మహత్య లాంటి తీవ్ర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.   ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం విశాఖ జిల్లాలో నిరుద్యోగి త్రినాథ్‌ సెల్‌టవర్‌ ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆత్మహత్య లేఖలో ప్రశ్నించాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే నా మరణానికి అర్థం ఉంటుంది.  మా అమ్మ నన్ను కన్నందుకు ఓ ప్రయోజనం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి రాసిన లేఖను త్రినాథ్‌ జేబులో పెట్టుకుని ప్రాణాలు వదిలాడు.  

మృతుడి కుటుంబీకులకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల పరామర్శ
 త్రినాథ్‌ కుటుంబీకులను వైయ‌స్ఆర్ సీపీ  నేతలు పరామర్శించి సంతాపం తెలిపారు. త్రినాథ్‌ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. హోదా వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడేవన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసానికి నిరుద్యోగి బలయ్యాడని నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Back to Top