సీబీఐతో విచారణ జరిపించాలి

చంద్రబాబు దోషులను రక్షిస్తున్నాడు
రూ. 10 వేల కోట్ల స్కాం జరిగితే ఇలాగానే వ్యవహరించేది
దోషులను ఎక్కడా కూడా అరెస్ట్ చేయడం లేదు
సీీబీఐ విచారణ జరిగితే డొంక కదులుతుందనే సీఐడీ విచారణ
విచారణ జరుగుతుండగానే మంత్రి ప్రత్తిపాటి భార్యకు భూములు అమ్మారు
హైకోర్టు జడ్జిల నేతృత్వంలో ఆస్తుల వేలం జరగాలిః వైఎస్ జగన్

హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో  చంద్రబాబు దోషులను శిక్షించాల్సింది పోయి రక్షిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్లో 2460 కోట్ల రూపాయల శారద చిట్ఫండ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతోందని, అంతకంటే ఎక్కువ మోసం చేసిన అగ్రిగోల్డ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ అయితే డొంక కదులుతుందనే..చంద్రబాబు తమ చెప్పుచేతల్లో ఉండేవిధంగా సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శించారు. 

అసెంబ్లీలో అగ్రిగోల్డ్పై చర్చలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే... అగ్రిగోల్డ్ కు సంబంధించి  సీఐడీ లెక్కల ప్రకారమే 32 లక్షల మంది బాధితులు ఉన్నారని చెబుతున్నారు. వాస్తవంగా 40 లక్షల పై చీలుకు కుటుంబాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.  సీఐడీ లెక్కల ప్రకారం 6వేల 850 కోట్లు డిపాజిట్ దారులు. వడ్డీలతో  కూడా కలుపుకుంటే  మరో 3150 కోట్లు. అంతా కలిపి దాదాపు 10 వేల కోట్లు అని సీఐడీ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఇంకా లెక్కలు తేలే పరిస్థితి కనిపిస్తోందని వైఎస్ జగన్ చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పెరిగిందని తెలుగుదేశం సభ్యులు  పిచ్చిపిచ్చిగా ఆరోపలు చేస్తున్నారు. అసలు టాపిక్ ఏంది. ఏం మాట్లాడుతున్నామన్నది ఆలోచన చేసుకోవాలి. 1998 మార్చి 31న సెబీ రాసిన లేఖను  వైఎస్ జగన్ చదివి వినిపించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచిన టీడీపీ, ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దోషులను శిక్షించాల్సింది పోయి, వారిని రక్షిస్తున్నారని ఫైరయ్యారు. 2014లో నెల్లూరులో అగ్రిగోల్డ్పై తొలికేసు నమోదైందని, 2015 జనవరి 5న సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. విచారణ దారుణంగా జరుగుతోందని విమర్శించారు. సీఐడీ విచారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార పార్టీ నాయకులు పలుమార్లు అడ్డుతగులుతూ ఎదురుదాడికి దిగారు. 

అగ్రిగోల్డ్పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ 2015 ఫిబ్రవరి 20న జీవో 23 ఇచ్చారు. ఇందులో తిరుపతికి సంబంధించిన ఆస్తిని ఎక్కడా ప్రస్తావించలేదు. విచారణ జరుగుతుండగానే అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ అనే వ్యక్తి ఆ ఆస్తిని రూ.14 కోట్లకు అమ్మేశాడు. అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థ రాం ఆవాస్ రిసార్ట్స్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్.. మంత్రి పుల్లారావు భార్యకు ఈ భూములు అమ్మారు. జీవో 23 రావడానికి నెల ముందే పుల్లారావు తన భార్య పేరిట భూములు కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభలో వైఎస్ జగన్ చూపించారు. ప్రభుత్వం అటాట్ చేసిన భూముల్లో ఈ భూమిని చేర్చలేదని స్పష్టం చేశారు.

వెంకాయమ్మ పేరుతో భూములు కొనుగోళ్లు జరిగాయని మంత్రి ఒప్పుకొన్నందుకు సంతోషమని వైఎస్ జగన్ చురక అంటించారు. వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, బోండా ఉమలు మధ్య లేచి సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఐనా సంయమనంతో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన కష్టాలను వైఎస్ జగన్ సభలో వివరంగా తెలిపారు. 8 లక్షల మంది ఏజెంట్లు ఊళ్లు విడిచిపెడుతున్న పరిస్థితి . వంద చీలుకుపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని జననేత వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం కేసు నీరుగారుస్తుందని అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంఘం హైకోర్టులో సీబీఐ విచారణ కోరిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 

సీఐడీ అధికారులు సీతారామ్ అవ్వాస్, ఉదయ్ కిరణ్లను అరెస్ట్ చేయలేదు. వీరిద్దరినీ కాకుండా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై  సీబీఐ చేత విచారణ జరిపించాల్సిందేనని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జి నేతృత్వంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగాలని పేర్కొన్నారు. 1998లో సెబి అగ్రిగోల్డ్ కంపెనీని నిషేధించమని చెప్పిన విషయాన్నిజననేత తెలియజేశారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేదని ప్రశ్నించారు. సెబీ అగ్రిగోల్డ్ను బ్యాన్ చేయమంటే.. చంద్రబాబు అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్తో ఫొటో దిగారని మండిపడ్డారు. 

సీఐడీ విచారణ సరిగా జరగడం లేదని వైఎస్ జగన్ చెప్పారు. అగ్రిగోల్డ్ కు 155 కంపెనీలున్నాయని, మిగిలిన అన్నింటిపై ఆరా తీయాలన్నారు.  అగ్రిగోల్డ్ కు సంబంధించిన చైర్మన్ పుత్రుడు దుబాయిలో బంగారం షాపు పెట్టాడు. ఆయనపై ఎక్కడా విచారణ జరగడం లేదు. అరెస్ట్ చేయాల్సిన పనిలేదంటూ సీఐడీ కోర్టుల ముందే దారుణంగా చెబుతోంది.  బాధితులకు న్యాయం చేస్తామని  ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. అగ్రిగోల్డ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top