ఇంకెంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే మీకు జ్ఞానోదయమవుతుంది బాబూ?

14–07–2018, శనివారం
గొల్లల మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా

ఈ రోజు ఉదయం ఊలపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర.. బిక్కవోలు మీదుగా సాగి.. గొల్లలమామిడాడలో వర్షంలోనే జరిగిన భారీ బహిరంగ సభతో ముగిసింది. జాతీయ స్థాయిలో చాంపియన్‌ ట్రోఫీ సాధించినా ఎలాంటి ప్రోత్సాహమూ లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు.. ఈ రోజు కలిసిన బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు. క్రీడా స్థలాలు లేకున్నా.. కనీసం సౌకర్యాలకు కూడా నోచుకో కున్నా.. పతకాలు సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చా మన్నారు. సాధించిన పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికె ట్లు చూపించారు. కనీసం టీ షర్టులు, స్పోర్ట్స్‌ కిట్లు అందని దౌర్భాగ్యమన్నారు.

మన రాష్ట్రంలోనే ఎందుకీ దుస్థితి.. అంటూ వాపోయా రు. ‘సార్‌.. స్పోర్ట్స్‌ కోటా మెడికల్‌ సీట్లను సైతం అమ్ము కుంటున్నారు. ఈ నాలుగేళ్లలో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదు’ అంటూ క్రీడా రంగానికి పట్టిన చంద్రగ్రహణాన్ని వివరించారు. ప్రతిభావంతులైన ఇలాంటి గ్రామీణ క్రీడాకారులు ఏ ఆసరా లేకున్నా జాతీయ స్థాయిలో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించినా.. పట్టించుకోని, ప్రోత్సాహమివ్వని ఈ ప్రభుత్వ పెద్ద.. తనకు ప్రచారం బాగా వస్తుందనుకున్న చోట మాత్రం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు. 


పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది మా పరిస్థితి.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయుష్‌ విభాగ పారామెడికల్‌ సిబ్బంది. ‘గత ఎన్నికలకు ముందు మా జీతభత్యాలు పెంచాలని, మమ్మల్నందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు.. నేడు ఆయన హయాంలో మాత్రం.. 16 నెలలుగా జీతాలివ్వకపోగా మా ఉద్యోగాలకే ఎసరు పెట్టాడు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నమ్మించి మోసం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రిగారి ప్రచార యావకు పరాకాష్టగా నిలిచి.. 29 మంది ప్రాణాలు బలిగొని.. 52 మందిని తీవ్రంగా గాయపరిచిన పుష్కర తొక్కిసలాటకు నేటికి సరిగ్గా మూడేళ్లు. చంద్రబాబుగారి ప్రచార సినిమా ఎఫెక్ట్‌ కోసం తెల్లవారు జాము నుంచే గేట్లు మూసి జనం గుమికూడేట్టు చేయడం.. వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కర ఘాట్‌లో ఆయన స్నానమాచరించడం వాస్తవం. ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరిచి అందరినీ ఒకేసారి వదలడమే ప్రమాదానికి కారణమని కలెక్టర్‌గారు ప్రాథమిక నివేదిక ఇవ్వడమూ వాస్తవమే.

ఈ ఘటనపై మొక్కుబడి కమిషన్‌ వేయడం.. ఆ కమిషన్‌ విచారణకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సహకరించకుండా చేయడమూ వాస్తవమే. సీసీ కెమేరాల, డ్రోన్‌ కెమేరాల పుటేజీలు లేవనడం, రూ.40 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌తో చిత్రీకరించిన పుటేజీనీ బయట పెట్టకపోవడమూ వాస్తవమే. ఇన్నేళ్లయినా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయలేదంటే విచారణలోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లయినా కమిషన్‌ నివేదిక రాకపోవడం వెనుక ఉన్న ప్రభుత్వ దురుద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును దోషిగా చూపని ఏ నివేదిక అయినా సత్యదూరమే అవుతుందన్నది మాత్రం ముమ్మాటికీ వాస్తవం. 

ఈ రోజు సాయంత్రం గోదావరిలో పడవ బోల్తాపడి ఏడుగురు గల్లంతయ్యారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. గత ఎనిమిది నెలల్లోనే నాలుగు వరుస బోటు ప్రమాదాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగించింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత నవంబర్‌లో విజయవాడ కృష్ణానదిలో ఘోర బోటు ప్రమాదం జరిగినప్పుడే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినా.. మీ వైఫల్యాన్ని వేలెత్తి చూపినా.. పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా పట్టించుకోకపోవడమే.. వరుస ప్రమాదాలకు కారణం కాదా? ఇంకెన్ని ప్రమాదాలు జరిగి.. ఇంకెంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. మీకు జ్ఞానోదయమవుతుంది? 
-వైయ‌స్‌ జగన్‌    

తాజా ఫోటోలు

Back to Top