బాబు గర్జన విభజనకా.. సమైక్యానికా?

హైదరాబాద్:

చంద్రబాబు నాయుడి ప్రజా గర్జన సమైక్యం కోసమా.. రాష్ట్ర విభజన కోసమా వివరణ ఇవ్వాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అలా వివరణ ఇవ్వకపోతే ఆయనకు ప్రజలలోకి వచ్చే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించింది. సమైక్యం అన్న మూడు అక్షరాలు చంద్రబాబు ఎందుకు పలకడం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబుది ప్రజాగర్జన కాదని, 'ఈల' మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుకు ప్రజా గర్జన ఎంతమాత్రమూ సరిపోదని అన్నారు. తిరుపతి నుంచి ప్రారంభించిన యాత్రకు 'సమైక్య ప్రజా గర్జన' అని పేరు పెట్టి ఉండాల్సిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వీరభద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు రాష్ట్ర విభజన రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం అని చెబుతున్నారే తప్ప సమైక్యంగా ఉంచమని ఎందుకు చెప్పడం లేదని దాడి ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ విభజన చేస్తున్నారని చంద్రబాబు అనడాన్ని నిబంధనల ప్రకారం ముక్కలు చేసేయండని చెబుతున్నట్లుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు నిరంతరమూ జగన్నామస్మరణ చేయడం, దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తాను చేస్తున్న ప్రజా గర్జనకు 'విభజన గర్జన' అని పేరుపెట్టాలని సూచించారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేయాలంటూ తాను లేఖ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అయినా వెల్లడించాలన్నారు. ఒక పక్కన విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు మరో పక్కన విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో యాత్ర చేయడమేమిటని దాడి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తన విధానం విభజనకు అనుకూలమా లేక సమైక్యమా అనేది స్పష్టం చేసి అయోమయానికి ముగింపు చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన లాంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా ఒక విధానం ఉంటుందని, అయితే టీడీపీ మాత్రం ఇరు ప్రాంతాలను మోసగిస్తోందన్నారు. రాజకీయాల్లో ఇది ఆరోగ్యకరమైన విధానం కాదన్నారు.

విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాక, దానిని వెనక్కి తీసుకోవడానికి నిర్దయగా తిరస్కరించిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో యాత్ర చేయడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని దాడి దుయ్యబట్టారు. ఇలాంటి విధానంతో ఆయన అన్ని ప్రాంతాల ప్రజలను నిలువునా మోసగించడమే అన్నారు.

మహానేత డాక్టర్ వై‌యస్ఆర్, శ్రీ జగన్‌పై అవినీతి ఆరోపణలతో 2004, 2009 ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు పరాజయం పాలయ్యారని, ఇప్పటికీ అదే పనిచేస్తున్న ఆయనకు వచ్చే ఎన్నికల్లోనూ శృంగభంగం తప్పదని చెప్పారు. తనకు సీఎం పదవి ఇస్తే మూడు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తానని బాబు చెప్పారని, అంటే అధికారం ఇస్తే తప్ప ఆ పరిష్కారం ఏమిటో చెప్పరా? అని ప్రశ్నించారు. అంటే నిప్పుపెడుతున్నదీ, సంక్షోభానికి తానే కారణమని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు కాదా? అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top