కొత్త రాజధానికి నిధులు ఎవరు ఇస్తారు?

నూజివీడు (కృష్ణా జిల్లా), 25 నవంబర్ 2013: రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను ఎవరిస్తారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖ‌ర్ ప్రశ్నించారు. నూజివీడులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజనతో హైదరాబా‌ద్‌పై సీమాంధ్రులకు హక్కు ఉండదని ఆయన చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి, 10 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని తెలిపారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు ఇప్పటి వరకూ కేంద్రం 500 కోట్ల రూపాయల ప్యాకేజి కూడా ఇవ్వలేదని తోట చంద్రశేఖర్ చెప్పారు. విభజన జరిగితే పోలవరం‌ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం అయ్యే పని కాదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రె‌స్‌ పార్టీ మన రాష్ట్రాన్ని విభజిస్తోందని చంద్రశేఖర్ విమర్శించారు.‌ అడ్డగోలుగా, ఏకపక్షంగా, నిరకుశంగా చేస్తున్న రాష్ట్ర విభజనను అడ్డుకునే ఏకైక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని చంద్రశేఖర్ అన్నారు.

Back to Top