ప్రజలకు మనం అండగా నిలబడాలి: జగన్


అనంతపురం, సెప్టెంబర్ 18 : ‘‘చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు, చెల్లెమ్మలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీ అంశంపై రోజుకో మాట మారుస్తూ వస్తున్న చంద్రబాబు.. తాజాగా పింఛన్లలో కోతలకు సిద్ధమవుతున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల సంఖ్యను భారీగా తగ్గించడం, ఆ ఇచ్చే పింఛన్లు కూడా పచ్చ చొక్కాలకే అందేలా విధివిధానాలు రూపొందిస్తున్నాడు.

ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా సక్రమంగా నెరవేర్చని చంద్రబాబు మోసపూరిత వైఖరిని రైతులు, చెల్లెమ్మలు నిలదీసే రోజులొస్తున్నాయి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గాల వారీగా రెండు రోజుల సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు గురువారం ఉదయం ఆయన నగరానికి చేరుకున్నారు. బెంగళూరు జాతీయ రహదారిలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో గురువారం మొదలైన సమీక్ష సమావేశంలో శ్రీ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.

చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఈ రోజున గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలబడి బాబు ప్రజా వ్యతిరేక చర్యలపై ముందుండి పోరాడాలి. ఎన్నికల్లో బాబు కూటమికి, మనకి తేడా దాదాపు ఐదు లక్షల ఓట్లు మాత్రమే. గడిచిన కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో నాకు వచ్చిన మెజార్టీనే 5.45 లక్షల ఓట్లు. ఈ మెజార్టీతో పోల్చుకుంటే చంద్రబాబు కూటమికి రాష్ర్టవ్యాప్తంగా వచ్చిన ఓట్లు పెద్దలెక్కేమీ కాదు. నేనూ చంద్రబాబులా అబద్ధపు మాటలు చెప్పి ఉంటే.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండేది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారు. ఎలాగోలా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నాడు. గ్రామాల్లోకెళ్తే రైతులు, అక్కచెల్లెళ్లు నిలదీస్తున్నారు. తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.

పింఛన్లను కత్తిరించడానికి చంద్రబాబు జీవో 135ను కొత్తగా తయారుచేశారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఇతర పింఛన్లకు సంబంధించి 43,11,668 మంది లబ్ధిదారులు ఉన్నారు. పింఛన్ మొత్తం పెంచడానికి రూ. 3,700 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1300 కోట్లు కేటాయించారంటే దాని అర్థం రూ. 2,400 కోట్లు కోత విధించడమే. ఈ పింఛన్ల లబ్ధిదారులపై కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో టీడీపీ వారికి మాత్రమే స్థానం కల్పిస్తుండటం మరో దారుణం. టీడీపీ శ్రేణులకే ఫించన్లు వచ్చే మాదిరిగా బాబు మాయోపాయాలు పన్నుతున్నాడు.

జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలంటూ మాట మారుస్తున్నాడు. రైతులకు సంబంధించి రూ.87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తానని తన మోసపూరిత మాటలతో చంద్రబాబు కొద్దో గొప్పో రైతులను నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతన్నలు నేడు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్‌లో వారికి బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలకు 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకులు చెబుతున్నాయి. మరోవైపు పంటల బీమా అందని పరిస్థితి. డ్వాక్రా మహిళల పొదుపు నుంచి సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. ఇంత దారుణంగా బాబు ప్రజలను మోసం చేస్తున్నాడు.

చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఎన్నికల సందర్భంగా అబద్ధాలు ప్రచారం చేశాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవు కదా అని బాబు అడ్డగోలు పాలన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మనకు ఉన్నది...చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతే అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ బలోపేతం కోసమే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, గత ఎన్నికల్లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశామని, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు.

8 నియోజకవర్గాల నేతలతో సమీక్ష

రామకృష్ణ ఫంక్షన్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఏకధాటిగా  సమీక్షలు కొనసాగాయి. ఒక్కొసారి రెండేసి నియోజకవర్గాల నేతలతో జగన్ నేరుగా మాట్లాడారు.నియోజకవర్గాల వారిగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పార్టీ నేతల అభిప్రాయాలను ఓపిగ్గా నోట్ చేసుకున్నారు. తొలిరోజు పెనుకొండ, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం , మడకశిర, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల సమీక్ష పూర్తిచేశారు.

ఈ సమీక్ష సమావేశాలకు ఆయా నియోజకవర్గాల నేతల, మండల స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, అనంతపురం జిల్లా నేతలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top