విజయమ్మ 'కరెంటు సత్యాగ్రహం' ప్రారంభం

హైదరాబాద్, 2 ఏప్రిల్‌ 2013: కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభానికి, విద్యుత్ ఛార్జీల పెంపు‌నకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష ‌ప్రారంభించారు. 'కరెంటు సత్యాగ్రహం' పేరుతో శ్రీమతి విజయయ్మ హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభించారు. శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఆమరణ దీక్షలో కూర్చున్నారు. ముందుగా దీక్షా వేదిక మీదకు వెళ్ళిన శ్రీమతి విజయమ్మ వేదికపైన ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంతకు ముందు.. లోటస్‌పాండ్‌లోని తమ నివాసం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరి పంజాగుట్టకు శ్రీమతి విజయమ్మ చేరుకున్నారు. అక్కడ ఉన్న మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఆమె బషీర్‌బాగ్‌లో ఉన్న విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళారు. అక్కడ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి విద్యుత్‌ సంక్షోభం, ప్రభుత్వం తీరును ప్రతిబింబించేలా రూపొందించిన ప్లకార్డులు చేత పట్టుకుని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులోని 'కరెంటు సత్యాగ్రహం' దీక్షా వేదిక వరకూ పాదయాత్రగా శ్రీమతి విజయమ్మ వెళ్ళారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలంతా విజయమ్మ వెంట నడిచారు.

'కరెంటు సత్యాగ్రహం' దీక్షా వేదికపై వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు‌లు అర్పించిన అనంతరం శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. తరువాత శ్రీమతి ఆమరణ దీక్షకు కూర్చున్నారు.
 
ఆమరణ దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యేలు:
శ్రీమతి వైయస్‌ విజయమ్మ, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కె. శ్రీనివాసులు, జి. శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుర్నాథరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, కొడాలి నాని, ఎం. రాజేశ్‌కుమార్, ‌తానేటి వనిత, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లె), ఎన్.అమరనాథరెడ్డి, సాయిరాజు, జోగి రమే‌శ్, గొట్టిపాటి రవికుమా‌ర్, పేర్ని నాని, కూన శ్రీశైలంగౌ‌డ్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.

ఎమ్మెల్సీలు‌ : జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు.

'వైయస్ఆర్ అమర్ రహే' అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో ప్రాంగణ మారుమోగింది. మహానేత వైయస్ఆర్ విగ్రహం ముందు 'అంధకారంలో రాష్ట్రం... అయోమయంలో ప్రభుత్వం' అని నినాదం రాసిన ప్లకార్డు అందరినీ ఆకర్షించింది.

Back to Top