<strong>హైదరాబాద్, 14 మార్చి 2013:</strong> రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.<br/>విద్యుత్ కోతలతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పదివేల నుంచి 15 వేల రూపాయల వరకూ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సమస్య తలెత్తిందని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తాము వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం సభలో చర్చకు వెనకాడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పాటు చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.