‘వస్తున్నా నా కోసం’ అంటే బాగుండేది: ఏజేవీబీ

అమలాపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ‘వస్తున్నా మీకోసం’ అనేకంటే ‘వస్తున్నా నా కోసం’ అని పేరుపెడితే బాగుంటుందని వైయస్ఆర్ సీపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబును జనం నమ్మే స్థితిలో లేరన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని హైస్కూల్ సెంటర్‌లో పార్టీ పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన ఏర్పాటైన సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విభాగ పట్టణ కన్వీనర్ అడ్డాల మణికంఠ గణేష్ (సన్నీ), ఉపాధ్యక్షుడు పోనకల తాతాజీ, కార్యదర్శి తొగర ఫణికుమార్, యూత్ పట్టణ కార్యదర్శి చేట్ల రామారావు ఆధ్వర్యంలో సుమారు మూడువందల మంది పార్టీలో చేరారు.  పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, యూత్, వాణిజ్య, సేవాదళ్, లీగల్‌సెల్ విభాగాల జిల్లా కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, ఎం. గంగాధర్, ఎం. మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా అధికారప్రతినిధి పి.కె. రావు, ఆదిరెడ్డి అప్పారావు, ఆర్.వి. సత్యనారాయణచౌదరి, కొండేటి చిట్టిబాబు, శెట్టిబత్తుల రాజబాబు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. తొలుత యూత్, సేవాదళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
హైస్కూల్ సెంటర్‌లో వైయస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చిట్టబ్బాయి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైల్లో ఉన్నా పార్టీ పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జగన్ ఒక్కరే రాష్ట్రానికి సుస్థిరపాలన అందించగలరన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగిందన్నారు. యూత్, సేవాదళ్ జిల్లా కన్వీనర్లు అనంతఉదయభాస్కర్, మార్గని గంగాధర్, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.

Back to Top