'వైయస్‌ పథకాల అమలు జగన్‌కే సాధ్యం'

విశాఖపట్నం, 15 డిసెంబర్‌ 2012: దళితులకు కావలసింది విభజన, భజన కాదని... ప్రేమ, ప్రగతి అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. దళితులకు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వాటిని పుష్కలంగా అందించారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన దమ్మూ, ధైర్యం ఉన్న మహా మనీషి వైయస్ అని కొనియాడారు. మహానేత వైయస్‌ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించ గల దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీ జగన్ అధికారంలోకి రావాలని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుసూస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల గిరిజన, ఆదివాసీల సమస్యలపై సదస్సు సందర్భంగా బాబూరావు కాసేపు మీడియాతో మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీలకు ఎవరేమి చేశారు?, ఎవరేమి చేశారనే అంశంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. సబ్‌ ప్లాన్‌ వల్ల ప్రయోజనం ఏమిటీ?, దళిత, గిరిజనులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందనే అంశంపై విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ సదస్సును నిర్వహిస్తోంది.

మహానేత డాక్టర్ వైయస̴్ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక దళితులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి, అమలు చేశారన్నారు. అందుకే దళితులు, గిరిజనుల హృదయాల్లో ఆయన దేవుడిగా నిలిచిపోయారన్నారు. ఆయన మరణించిన తరువాత సంక్షేమ పథకాలన్నీ సంక్షోభ పథకాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయన్నారు. దళితుల విభజన పేరు మీద టిడిపి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ‌దళితుల కోసమే తాము ఉన్నట్లు, దళితుల కోసమే అనేక పథకాలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వారు భజన చేసుకుంటున్నారన్నారు.
Back to Top