వైయస్ఆర్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు

హైదరాబాద్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నగర పాలక సంస్థలోని పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎల్బీనగర్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ గూడూరు నరేందర్‌రెడ్డి బుధవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని కేంద్రపాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

     ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ,  ప్రజాకంటకంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెపుతారని కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల నియంత్రణలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని వారు పేర్కొన్నారు. మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు శ్రీ జగన్మోహనరెడ్డికే సాధ్యమన్నారు.

Back to Top