తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికపై కోర్టుకెడతాం

తిరుపతి 11 ఫిబ్రవరి 2013:

తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. బ్యాంకుకు డైరెక్టర్లుగా ఎన్నికైన ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అధికార పార్టీ అక్రమాలపై సొసైటీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని వారు తెలిపారు. దొడ్డిదారిన అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కుట్రను బట్టబయలు చేస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికలు చెల్లవన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన సవాలు విసిరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందనీ, వారి పక్షాలన పోరాడుతుందనీ ఆయన చెప్పారు. టౌన బ్యాంకు ఎన్నికలలో డైరెక్టర్లుగా ఎంపికైన నారాయణ, ప్రభాకర్, వెంకటేశ్వరరెడ్డి తమ పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని ప్రకటించారు. మీకు సిగ్గు, ఎగ్గూ ఉంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా కోర్టులో తేల్చుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల ప్రహసనానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని భూమన వెల్లడించారు. కోర్టులు న్యాయం చేస్తాయన్న నమ్మకం తమకు పరిపూర్ణంగా ఉందన్నారు. ఈ ఎన్నిక చెల్లదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజా కోర్టులో నిలదీస్తామని భూమన పేర్కొన్నారు.

Back to Top