టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

– ప్రభుత్వ వైఫల్యం వల్లే చక్రపాణిరెడ్డిపై కాల్పులు
– అ«భిరుచి మధును వెంటనే అరెస్టు చేయాలి
– నంద్యాలకు అంతన్నారు..ఇంతన్నారు..కాకినాడ సంగతేంటి?
– స్మార్ట్‌ సిటీ, కాకినాడ–చెన్నై కారిడార్‌ ఏమైంది?
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్భలంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల జోలికి వస్తే సహించేది లేదని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి హెచ్చరించారు. తెలుగు దేశం ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేత అభిరుచి మధు కాల్పులు జరపడం దారుణమని ఆయన ఖండించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని పార్థసారధి ధ్వజమెత్తారు. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో గురువారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..నంద్యాలలో పట్టపగలే టీడీపీ నేత అభిరుచి మధు కత్తులతో స్వైరవిహారం చేయడం, గన్‌తో కాల్పులు కాల్చడం దుర్మార్గం. నంద్యాలలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా అధికార పార్టీ నేతలు ఇంతగా రెచ్చిపోవడం ఏంటీ?. పట్టపగలే బరితెగించి దాడులకు పాల్పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఉన్నా కూడా ఎందుకు తాత్సరం చేశారు?. చక్రపాణిరెడ్డిపై దాడి చేసేందుకు ఉప యోగించిన మారణాయుధాలను పోలీసులే దాచి పెట్టడంతో ఆంతర్యమేంటీ?  ముఖ్యమంత్రి ప్రోద్భలంతో దాడులకు తెగబడుతున్నారు. ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ తరఫున పని చేసే వారిని ఇబ్బందుల పాలు చేశారు.  ఈ ప్రభుత్వం నంద్యాల ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాష్ట్ర కేబినెట్‌అంతా కూడా అక్కడే మకాం వేసింది.  

బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలు ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. రెండు నెలల పాటు నంద్యాలలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను బెదిరించారు. కాకినాడలో కూడా అదే తంతు మొదలుపెట్టారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను, వారి బంధువులకు ఫోన్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. చిన్న చిన్న కార్యకర్తలు ప్రైవేట్‌కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటుంటే వారిని తొలగించేలా యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు. వీధుల్లో వ్యాపారం చేసే బడ్డీ కొట్టుల నిర్వాహకులకు బెదిరించి టీడీపీ నేతలు లబ్ధిపొందాలని చూస్తున్నారు. టీడీపీకి దమ్ముంటే అభివృద్ధి పనులను తెలియజేసి ఓట్లు అడగాలి. బెదిరించి ఓట్లు అడిగే స్థాయికి దిగజారవద్దు. నంద్యాలలో రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. కాకినాడలో ఏం సమాధానం చెబుతారు. కాకినాడ స్మార్ట్‌సిటీ అన్నారు. రూ.1450 కోట్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. ముడుపుల కోసం ఈ ప్రాజెక్టుకు నీరుగార్చారు. కాకినాడ ప్రజలకు మేలు జరుగకుండా ఉండేందుకు చంద్రబాబే కారణం. కేంద్రం రూ.300 కోట్లు మంజూరు చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కాకినాడకు బైపాస్‌ రోడ్డు అవసరం. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకినాడ నుంచే దోమలపై దండయాత్ర ప్రకటించారు. దోమకాటు కంటే టీడీపీ నేతల కాట్లకు ప్రజలు విలవిలలాడుతున్నారు. దోమలు చంపడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాకినాడలో ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌ ప్లాంట్‌ అన్నారు. కొబ్బెరి పంట ఆధారిత ఫ్యాక్టరీ అన్నారు. ఇవన్నీ ఏమయ్యాయి. కాకినాడ– చెన్నై కారిడార్‌ ఏమైంది. వీటికి సమాధానం చెప్పి కాకినాడలో ఓట్లు అడగండి. మా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. కేసులు పెడితే ఊరుకోం. ఖబడ్దార్‌
Back to Top