రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలను విచ్చలవిడిగా పెంచేస్తూ అవినీతికి పాల్పడుతోందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ. 10 కోట్ల అంచనాలతో చేపట్టాల్సిన పనులను రూ. 150 కోట్లకు పెంచారని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. హంద్రీనీవా సుజల స్రవంతి అంచనాలను ఐదింతలు పెంచారని చెప్పారు.<br/>రూ. 45 కోట్ల పనులను రూ. 180 కోట్లకు ఇచ్చారని, అది కూడా కాంట్రాక్టరుకు ఎలాంటి అనుభవం లేకపోయినా.. కేవలం రాజకీయ ఒత్తిడితో నామినేషన్ మీద ఈ పనులు అప్పగించారని దుయ్యబట్టారు. రూ. 150 కోట్లతో పూర్తి చేయాల్సిన కుప్పం బ్రాంచి కెనాల్ ప్రాజెక్టుకు సింగిల్ టెండర్ అనుమతించారని, ముఖ్యమంత్రికి ఈ విషయం తెలుసో, తెలియదో గానీ.. మొత్తం అన్నింటి వివరాలు తెప్పించుకుంటే ఈ అంశంలో వేలకోట్ల అవినీతి బయటకు వస్తుందని చెప్పారు. అయితే, ప్రశ్న ఇంకా పూర్తి కాకుండానే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానం ప్రారంభమైంది.<br/>దీనిపై వివాదం వచ్చినప్పుడు సింగిల్ సప్లిమెంటరీ అవకాశం అయినా శ్రీకాంత్‌రెడ్డికి ఇవ్వాలి కదా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు తమ పార్టీ సభ్యులేనని, వాళ్లకు కూడా ఇంకా అవకాశం రాలేదని చెప్పారు. అయినా స్పీకర్ మాత్రం తదుపరి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా మంత్రికి సూచించారు.