స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలి

హైదరాబాద్ :

స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని, ప్రత్యర్థి పార్టీలు పోటీలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి వచ్చేందుకు సాహసించని రీతిలో విజయం సాధించడానికి కృషి చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ‌హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నాడు శ్రీమతి విజయమ్మ అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు ఏర్పా టైన కోస్తా జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, లోక్‌సభా నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు ఆషామాషీగా తీసుకోరాదని, పూర్తిగా లీనమై పనిచేయాలని, 80 శాతం సీట్లు గెల్చుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు.

క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నాయకులు స్పందించాలని, అన్ని వేళలా వారికి పార్టీ అండగా ఉంటుందని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమస్యల పరిష్కారంలో వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రజల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని, అయితే కో ఆర్డినేటర్లు మితిమీరిన విశ్వాసంతో ఉండొద్దని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. గ్రామాల్లో సర్పంచ్ పదవులకు మన పార్టీ నుంచే ఎక్కువ మంది పోటీ పడితే కో ఆర్డినేటర్లు చాకచక్యంగా వ్యవహరించి త్వరలో మళ్లీ రాబోయే మండల, జెడ్పీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని సర్ది చెప్పాలని సూచించారు.

పంచాయతీల్లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ వద్ద సంపూర్ణ సమాచారం ఉందని వైఫల్యాలు చోటుచేసుకుంటే కో ఆర్డినేటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో సాధించే విజయాలను బట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని గుర్తుచేశారు. స్థాని క ఎన్నికల ఫలితాలను పార్టీ పూర్తిస్థాయిలో సమీక్షిస్తుందని వివరించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసేటపుడు అధికార పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంటుందని, అలాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి నిలదీయాలని విజయమ్మ సూచించారు. ఎక్కడైనా గ్రామాల్లో ఒక మంచి వ్యక్తిని అందరూ కలిసి ఎంపిక చేస్తే అలాంటి చోట్ల మనం కూడా సహకరించాలని పోటీగా అభ్యర్థులను నిలబెట్టరాదని చెప్పారు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ గల తొమ్మిది జిల్లాల పరిధిలోని పార్టీ నాయకులు పాల్గొన్న ఈ భేటీలో... ఈ నెల 14, 16 తేదీల్లో తిరుపతి, విజయనగరంలో స్థానిక ఎన్నికలపై ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వివరాలను పార్టీ సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. 14న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు కలిపి తిరుపతిలో ప్రాంతీయ సమావేశం జరుగుతుంది. 16న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి విజయనగరంలో ప్రాంతీయ సమావేశం జరుగుతుంది.

ఈ రెండు సమావేశాల్లో విజయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారని మైసూరారెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సీజీసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ చైర్మన్లు, సింగిల్‌విండోల చైర్మన్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు హాజరవుతారు. ఆయా జిల్లాల పార్టీ కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ కో‌ ఆర్డినేటర్లు, పార్లమెంటు సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాలు, మండల విభాగాల కన్వీనర్లు ఈ భేటీల్లో పాల్గొనాలని తెలిపారు.

ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉంది :
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా వాటిని ఎదుర్కోవడానికి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని మైసూరారెడ్డి చెప్పారు. ఇంతవరకూ ఎన్నికలు జరగకుండా ఆలస్యం కావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఖరేనని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పుపై ఎస్ఎ‌ల్‌పి వేసి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావించకుండా కావాలనే నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం, అధికార పార్టీలో అంతర్గత కలహాలు, లుకలుకలు కారణంగా వారు ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేక పోయారన్నారు.

సాధారణంగా ఎప్పుడూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరిపి ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే ప్రభుత్వం కుటిల రాజకీయంతో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని మైసూరా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘోరమైన తప్పిదాన్ని చేస్తూ ఉన్నా టిడిపి చోద్యం చూస్తోందే తప్ప ఇదేమిటని ప్రశ్నించడం లేదన్నారు. సమావేశంలో మైసూరాతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, సుజయ కృష్ణ రంగారావు, సీజీసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top