బాబూ.. నువ్వొక నాయకుడివా?

హైదరాబాద్ :

గర్జన పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊరూరా తిరుగుతూ మొరుగుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఊరికో గర్జన పెట్టి వాటిని లెక్క పెట్టుకుంటూ, సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఏ సభలోనూ వాస్తవాలు మాత్రం చెప్పడం లేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం తదితర 20 అంశాలు తీసుకున్నా.. దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డితో పోల్చితే చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

‘మాట్లాడితే హైటెక్ సిటీ అంటున్న చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడారా?’ అని‌ గడికోట ప్రశ్నించారు. పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేస్తే అవి వెయ్యి హైటెక్ సిటీలతో సమానమ‌ని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వాస్తవానికి చంద్రబాబు‌ సమయంలో కన్నా మహానేత వైయస్ హయాంలోనే ఐటీ రంగంలో ఎగుమతులు ఎక్కువగా జరిగినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతులు, రుణాలు, వడ్డీ రాయితీ గురించి ఆలోచించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

తొమ్మిదేళ్ళ తన భయానక పాలన గురించి చెప్పుకుని ఓటు వెయ్యమని అడిగే ధైర్యం లేక చంద్రబాబు ఇప్పుడు నరేంద్రమోడీ, పవన్‌కల్యాణ్, జేపీల మాస్కులు ధరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కడపలో గర్జన పెట్టి.. పార్టీ ముందుకు పోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. కడపలో వైయస్ఆర్ ఎలాంటి అభివృద్ధి చేశారో నీకు తెలుసా?’ అని గడికోట ప్రశ్నించారు. పులివెందులే కాదు.. 293 నియోజకవర్గాల్లోనూ ఆయన అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

‘చంద్రబాబు హయాంలో కుప్పం సహా మిగిలిన ప్రాంతాల్లో అంతటి అభివృద్ధి జరిగిందా? ధైర్యం ఉంటే చర్చకు రా?’ అని ‌చంద్రబాబు‌ను గడికోట సవాల్ చేశారు. ఐదేళ్లలో కుప్పంలో వైయస్ఆర్ 17 వేల ఫించ‌న్లు ఇప్పిస్తే, చంద్రబాబు పదేళ్లలో 5 వేలు మాత్రమే ఇవ్వగలిగారు. వైయస్ఆర్ 33 వేల ఇ‌ళ్ళు కట్టిస్తే బాబు 10 వేలే కట్టించగలిగారని గడికోట ఎండగట్టారు. ఐదేళ్ల పాలనలో రుణాల మాఫీ, ధరల స్థిరీకరణ వంటివెన్నో చేసి రైతులకు వైయస్‌ స్వర్ణయుగం చేశారన్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మరో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ‘ఇది చేశాను’ అని ఏదైనా చెప్పుకోగలరా? అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అవసరాలు తెలిసింది ఒక్క శ్రీ వైయస్ జగన్‌కే‌ అని, అందుకే ఆయన్ను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు.

ఢిల్లీలో విభజన లేఖలిచ్చి.. :
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘తెలంగాణ తన వల్లే వచ్చిందని వరంగల్‌లో మాట్లాడతారు. రాష్ట్రాన్ని ఈ విధంగా  విభజించడం ఏమిటని సీమాంధ్రలో మాట్లాడతారు. చంద్రబాబూ ఒక నాయకుడేనా?’ అని ధ్వజమెత్తారు. ‘మరణించిన మహానేత డాక్టర్ వై‌యస్ఆర్‌ని, ఆయన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? ఆయన బతికున్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయావ్’ అని మండిపడ్డారు. ‘బీజేపీతో పొత్తుపెట్టుకోనని, మైనార్టీలకు అన్యాయం చేయనని చెప్పి ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తున్నావ్.. నెల రోజుల్లో నీకు గుణపాఠం తప్పదు’ అని హెచ్చరించారు. ‘తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని చెప్పిన బాబు.. సీమాంధ్రలో ఆ ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? సీమాంధ్రలో బీసీలే లేరా?’ అని నిలదీశారు.

Back to Top