అమ్మో! చంద్రబాబు పాలన

కర్నూలు:

‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన ‌ఎంతో భయానకంగా కొనసాగింది. పేదవాడికి గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆపరేషన్‌కు లక్షల రూపాయలు ఖర్చయ్యేవి. కుటుంబ సభ్యులు వడ్డీలకు అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించుకుంటే వారు జీవితాంతం ఊడిగం చేసినా ఆ అప్పులు తీరని దుస్థితి‌ ఉండేది. పిల్లలు ఇంజనీరో, డాక్టరో చదువుకోవాలంటే ఏడాదికి రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చేది. అలా ఏటా రూ.30 వేలు ఫీజులు చెల్లించేందుకు తమ కొద్దీపాటి ఆస్తులను తెగనమ్మే దుస్థితిలో ఉన్న వారి తల్లిదండ్రుల గురించి చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవు' అంటూ చంద్రబాబు నాయుడి పాలనపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

ఏ గ్రామంలో ఎవరికైనా పింఛన్ కావాలంటే.. అప్పటికే పింఛను పొందుతున్న వారిలో ఒకరు చనిపోతే‌నే కొత్తవారికి ఇచ్చేవారు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో సోమవారం ‌నిర్వహించిన ‘వైయస్ఆర్‌ జనభేరి’ కార్యక్రమంలో శ్రీ జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం కర్నూలు చేరుకున్న శ్రీ జగన్‌కు నగర శివారులోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జగన్ పెద్దటేకూరు, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి మీదుగా పత్తికొండ, ఆస్పరి‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. అభిమాన యువ నాయకుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తమ గ్రామం మీదుగా వెళ్తున్నారని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసి కరచాలనం చేస్తూ పులకించిపోయారు.

అధికారంలో ఉన్న ఆ తొమ్మిదేళ్లూ ఏం చేశావు? :

‘చంద్రబాబు నాయుడి హయాంలో వంద పంచాయతీలకు 500 ఇళ్లు మంజూరు చేసేవారు. వాటిని కూడా తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేవారు. రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదే. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు చేయలేదు? ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్నారు. రాష్ట్రాన్ని‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా ముక్కలు చేస్తే... దానికి మీ ఎంపీల చేత అనుకూలంగా ఓటు వేయించింది నువ్వు కాదా చంద్రబాబూ? ఒక వ్యక్తిని పొడిచేసి ఆతని ఫొటోకు దండ వేసి వచ్చే సంస్కృతి చంద్రబాబుది. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న వ్యక్తి నీవు కాదా చంద్రబాబూ?’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

రోడ్ షోలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట కర్నూలు పార్లమెంటరీ స్థానం పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక, కర్నూలు, కోడుమూరు, డోన్, పత్తికొండ, ఆలూరు, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఎస్.వి.మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల అసెంబ్లీ స్థానం అభ్యర్థి భూమా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐదు సంతకాలు.. ఆరు పనులు :
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు చేసే ఐదు సంతకాలతో పాటు మరో ఆరు పనులతో రాష్ట్రం దశ, దిశ మారుస్తానని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆ సంతకాలు, కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

1) అమ్మ ఒడి పథకం: ఆర్థిక పరిస్థితి అనుకూలించక పిల్లల్ని చదివించలేని పేదల కోసం ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేశా. పిల్లలను బడికి పంపితే ఒక్కో పిల్లాడి పేరిట రూ.500 చొప్పున ఇద్దరికి రూ.వెయ్యి తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాం.
2) అవ్వా తాతలకు రూ.700 పింఛన్: వృద్ధాప్యంలో చిల్లర ఖర్చులకు కూడా చేయిచాపే పరిస్థితి రాకుండా ప్రతి అవ్వా తాతకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.700కు పెంచుతాం. వృద్ధాప్యంలో ఈ మొత్తం వారికి భరోసాను ఇస్తుంది.
3) రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి: అహర్నిశలు కాయకష్టం చేసి, కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే ఆత్మహత్యే శరణ్యమనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపై వారికి అలాంటి కష్టం రానివ్వను. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి భరోసానిస్తాం.
4) డ్వాక్రా రుణాలు రద్దు: ఇది కూడా అక్కాచెల్లెళ్ల కోసమే. డ్వాక్రా రుణాలకు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి నెల 1వ తేదీన వాయిదా చెల్లించకపోతే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా ఆ తల్లులు వారి పిల్లలను సైతం పనికి పంపిస్తున్నారు. ఇకపై వారికి అలాంటి కష్టం రానివ్వను. డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేసి వారికి అండగా నిలుస్తాం.

5) ప్రతి గ్రామంలో పౌర సేవా కేంద్రాలు: రేషన్ కార్డు, పింఛ‌న్ తదితర సేవల కోసం ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా 24 గంటల్లో ఏ కార్డు అయినా అందేలా చర్యలు తీసుకుంటాం.
6‌ ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు: గుడిసే లేని రాష్ట్రంగా చేయడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 10 లక్షల చొప్పున 50 లక్షల ఇళ్లను నిర్మిస్తాం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా భరోసా కల్పిస్తాం.
7) ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం: ఆరోగ్యశ్రీలో తొలగించిన వ్యాధులను తిరిగి చేర్చి పూర్వవైభవం తీసుకొస్తాం. రాజధానిలో 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఏర్పాటు చేసి వైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచుతాం. బధిరులకు ప్రత్యేకంగా కాక్లియ‌ర్ ఇంప్లాంట్ సర్జరీకి అయ్యే ఖర్చును రీయింబ‌ర్సు చేస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తాం.

8) ఏడు గంటల ఉచిత విద్యుత్: రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను పగటిపూటే అందిస్తాం. 2019లోగా రాష్ట్రాన్ని విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
9‌) రూ.100కే 150 యూనిట్లు: ఇప్పుడు ఇళ్లకొచ్చే కరెంటు బిల్లు చూస్తే అందులో బిల్లేదో, సర్‌చార్జీ ఏదో తెలియని పరిస్థితి. భారీగా వస్తున్న బిల్లులు కట్టలేక పేదలు దొంగ కరెంటు వాడుకునే దుస్థితి. ఈ కష్టాలు ఇక లేకుండా చేస్తాను. రూ.100 కే 150 యూనిట్ల కరెంటు అందిస్తాను.
10) గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తేస్తాం: గ్రామాల్లో బెల్టు షాపుల వల్ల పేద కుటుంబాలు నిరుపేదలుగా మారుతున్నారు. ఈ కారణంగా ఆ కుటుంబాలు వారి పిల్లలకు మంచి చదువును చెప్పించలేకపోవడమే కాక అనారోగ్యానికి గురవుతున్నారు. అన్ని సమస్యలకు మూలమైన బెల్టు షాపులను ఎత్తివేసి నియోజకవర్గానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చేస్తాం. అందులో కూడా మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండేలా చూస్తాం.
11‌) ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశం: రాష్ట్రంలో చదువుకున్న ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకుండా వారికి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాను. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను బలోపేతం చేస్తాం.

Back to Top