సమైక్య పోరాటానికి మద్దతు ఇవ్వండి

న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నాయకులందరూ సహకరించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వచ్చిన పార్టీ నాయకుల బృందం కోరింది. సమైక్య ఉద్యమంలో తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని జాతీయ స్థాయి నాయకులను శ్రీ జగన్ కోరారు. స‌మైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ వచ్చిన శ్రీ జగన్‌ బృందం శనివారం ఉదయం సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు సీపీఐకి చెందిన పలువురు ముఖ్య నేతలతోనూ శ్రీ జగన్ చర్చలు జరిపారు. ‌ఈ సందర్భంగా వారికి శ్రీ‌ జగన్ ఐదు పేజీల లేఖను అందజేశారు.

సీపీఐ నాయకులతో 45 నిమిషాలకు పైగా శ్రీ జగన్‌ బృందం భేటీ కొనసాగింది. ఈ భేటీకీ శ్రీ జగన్ వెంట పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.

జగన్‌ ప్రయత్నం అభినందనీయం - సురవరం :

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అభినందించారు. రాజ్యాంగంలోని మూడవ అధికరణం దుర్వినియోగం కాకుండా చూడాలని శ్రీ జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు.‌ శ్రీ జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా భేటీ అయిన అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు.‌

'జగన్, ఇతర నేతలు అన్ని జాతీయ పార్టీలను కలుసుకునే సందర్భంగా మమ్మల్నీ కలిశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నేను కలిసి వాళ్లతో చర్చించాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయ‌ వద్దని, సీపీఐ వైఖరిని పునరాలోచించాలని వారు మమ్మల్ని కోరారు. మూడవ అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, దానిపై మేం ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. రాష్ట్రాలను విభజించే అధికారాన్ని ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చింది. తెలంగాణకు సంబంధించి మా వైఖరిలో పునరాలోచన లేదు. విభజన జరిగి తీరాల్సిందేనని పునరుద్ఘాటించాం.'

'భవిష్యత్తులో పార్లమెంటులో మెజారిటీ ఉండి ఇష్టం వచ్చినట్లు విభజన జరిగే అవకాశం ఉందని, దేశం ముక్కలు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకీ 272 సీట్లు రావు. ఫ్రంటులు ఏర్పడతాయి. అలా ఏర్పడిన ఫ్రంటులలో ఏకాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడిపోతామంటే వారిని బలవంతంగా ఆపలేమని, అయితే ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు న్యాయం చేయడానికి మా పార్టీ నిలుస్తుంది. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఇతర ప్రాంతాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉద్యమిస్తాం. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు న్యాయం జరిగిన తర్వాతే విభజన ప్రక్రియ ముందుకు సాగాలి' అని సురవరం చెప్పారు.

విభజన విషయంలో రాష్ట్రంలోని వివిధ స్టేక్ హోల్డర్లను సప్రందించకుండా ముందుకు వెళ్లడం తగదని గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశామని, కోస్తాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన రెండూ జరగాలని సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. దేశం ముక్కలు కావడం తమకూ ఇష్టం లేదని, అయితే అదే సమయంలో తెలంగాణ ప్రాంత వాసులకు ఇన్నాళ్లుగా జరిగిన అన్యాయాన్ని మాత్రం విభజన ద్వారానే సరిచేయాలని చెప్పారు. పొత్తుల విషయంలో మాత్రం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, లౌకిక వాదంతో ఉండాలన్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విధానాన్ని అభినందించామని చెప్పారు.‌

Back to Top