ఢిల్లీ చేరుకున్న వైయస్ జగన్‌ బృందం

న్యూఢిల్లీ, 23 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బృందం శనివారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదే‌శ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవనున్నారు. ఇంతకు ముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినె‌ట్ ముందుకు వస్తుందని చె‌బుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి.. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై ఆయనకు సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు జనతాదళ్ (యూ) అధినేత శరద్‌యాదవ్‌ను కూడా కలిసి.. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా వివరి‌స్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేందుకు తాము చేస్తున్న పోరాటంలో కలసిరావాలని కోరతారు.

ఈ నెల 24వ తేదీ ఆదివారం శ్రీ జగన్ ‌ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లి ఉదయం 11.30 గంటలకు బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీ‌న్ పట్నాయ‌న్‌ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సాగిస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని పట్నాయక్‌ను కోరతారు.

25న శరద్‌ పవార్‌తో భేటి :
ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ జగన్‌ కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను ముంబైలో కలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించేందుకు శ్రీ జగన్‌ ఎన్సీపీ సహకారాన్ని కోరతారు.

శ్రీ జగన్‌తో పాటు ఢిల్లీ వచ్చిన పార్టీ బృందంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్‌పీవై రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్ర బోస్, మాజీ ఎంపీ బాలశౌరి, నల్లా సూర్యప్రకాశ్‌ వచ్చారు.

Back to Top