పలుచోట్ల వైయస్ఆర్‌సీపీ శ్రేణుల అరెస్టు

హైదరాబాద్, 7 నవంబర్ 2013:

రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్రానికి స్పష్టంగా తెలియజేయడానికి 48 గంటల రహదారులు దిగ్బంధం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఇచ్చిన పిలుపుతో రెండవ రోజు గురువారం కూడా ఆందోళన కొనసాగింది. రోడ్లను దిగ్బంధించిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా రెండవ రోజున కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించింది.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 9‌వ నెంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించిన పార్టీ నాయకుడు జోగి రమేష్, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. భీమవరంగట్టు వద్ద సామినేమి ఉదయభానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని గొల్లపూడిలో పార్టీ నాయకుడు జలీల్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. వైయస్ఆర్‌ జిల్లాలోని పోరుమామిళ్లలో 100 మంది ‌పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. జిల్లాలోని గద్వేలి-కడప హైవే దిగ్బంధ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేశారు. దీనితో పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ పోలీస్‌ స్టేషన్ ఎదుట వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.


పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద 16వ నెంబర్‌ జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొన్న పార్టీ సమన్వయకర్త కూనపరెడ్డి వీరరాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని నర్సాపురంలో 214వ నెంబర్‌ జాతీయ రహదారిని నిర్భందించగా, ఏలూరు-రాజమండ్రి హైవేను కూడా దిగ్బంధించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 216వ నెంబర్‌ జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త సంజీవయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కనపర్తిపాడు వద్ద కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లాలోని వేమూరు వద్ద తెనాలి-రేపల్లే హైవే దిగ్బంధించగా, గుంటూరు- అమరావతి హైవేను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు దిగ్బంధించారు. అనంతపురం-కడప హైవే దిగ్బంధించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని యధావిధిగా ఉంచాలని డిమాండ్ చే‌శారు.

Back to Top