జనం రుణం తీర్చుకోలేనిది: విజయమ్మ

విశాఖపట్నం/శృంగవరపుకోట :

'కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది' అంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ పార్లమెంటరీ స్థానంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. పాడేరు, అరకు, కొత్తవలస బహిరంగ సభల్లో ప్రసంగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన రోడ్‌షోలలో ప్రసంగించారు.

‘మరో మూడు వారాలు ఆగండి. కష్టాలు పడుతున్న మీ అందరికీ మీ మనవడు పింఛన్లు అందిస్తారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 చొప్పున ఇస్తారు. వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగ‌న్‌బాబు కూడా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు. వైయస్‌లా జగన్ మంచి నాయకుడు. మనసున్న నేత. జగ‌న్‌బాబు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో అయిదు సంతకాలు చేస్తారు. అవి రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాయి' అని భరోసా ఇచ్చారు.

'మీ అందరినీ నమ్మించడానికి చంద్రబాబు నాయుడు కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మకండి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఆయన ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వబట్టే ఈ రోజు రాష్ట్రం ముక్కలైంది’ అని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

విజయమ్మకు గిరిజనులు బ్రహ్మరథం :
శ్రీమతి వైయస్ విజయమ్మ తొలిసారిగా విశాఖ‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావడంతో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎన్నో సంక్షేమ పథకాల‌తో లబ్ధి పొందిన తమకు ఆయన సతీమణిని తొలిసారిగా చూసే భాగ్యం దక్కడంతో గిరిజనులు పండుగ చేసుకున్నారు. పాడేరు, అరకు బహిరంగ సభలకు వారు వేలాదిగా తరలివచ్చారు. శ్రీమతి విజయమ్మ ప్రసంగాలకు జై కొట్టారు.

శ్రీమతి విజయమ్మ పాడేరు చేరుకోగానే సభా వేదికకు కిలో మీటరున్నర ముందు నుంచే వేలాది జనం ర్యాలీగా ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. అరకులోనూ ‌ఆమెకు విశేష ఆదరణ లభించింది. జోరున వర్షం కురుస్తున్నా, ఆమెను చూసేందుకు ప్రజలు గంటల తరబడి అక్కడి నుంచి కదల్లేదు. వర్షంలోనే తడుస్తూ శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్నారు.

Back to Top