నిమ్సులో జగన్‌ను కలిసిన విజయమ్మ

హైదరాబాద్, 10 అక్టోబర్ 2013 :

నిమ్సు ఆస్పత్రిలో ఉన్న తన తనయుడు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీమతి విజయమ్మ గురువారం ఉదయం కలుసుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దని, సమైక్యంగా ఉంచాలంటూ నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆమరణ దీక్ష చేసిన శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. గత ఐదు రోజులుగా శ్రీ జగన్‌ చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేసి నిమ్సు ఆస్పత్రికి తరలించారు. ఉదయాన్నే ఆస్పత్రికి వచ్చిన శ్రీమతి విజయమ్మ తన కుమారుడిని కలుసుకున్నారు. కాసేపు శ్రీ జగన్‌తో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని.. ఇంకా నీరసంగా ఉన్నారని తెలిసింది. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి నిమ్సు వైద్యులు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించారు. పోలీసులతో పాటు నర్సులు కూడా శ్రీ వైయస్ జగన్ చేతిని గట్టిగా పట్టుకుని మరీ ఫ్లూయి‌డ్సు ఎక్కించారు.

అంతకు ముందు బుధవారం రాత్రి 10.55 గంటల సమయంలో పోలీసులు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని దీక్షా వేదిక నుంచి బలవంతంగా తీసుకువెళ్ళి నిమ్సు ఆస్పత్రిలో చేర్చారు. దీక్ష ఐదవ రోజుకు చేరుకోగా, శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. వెంటనే ఫ్లూయి‌డ్సు తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నిమ్సు ఆస్పత్రిలో శ్రీ జగన్‌ను పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మ, ఇంకా పలువురు కలిశారు.

Back to Top