పడకేసిన 'స్థానిక' పాలన

కోదాడ (నల్లగొండ జిల్లా),

26 జూన్‌ 2013: స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఈ ప్రభుత్వం రెండేళ్ళుగా కాలయాపన చేస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆక్షేపించారు. ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించని సిఎం భయాలు, బాధలు ప్రజలకు ఏమి అవసరమని ఆమె ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించని కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పరిపాలన పడకేసిందని, అభివృద్ధి, పారిశుధ్యం పనులు జరగడంలేదని, తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు అవసరమని ఆమె అన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో బుధవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల పంచాయతీరాజ్ సమావేశంలో శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ శ్రేణులంతా కలసికట్టుగా కృషి చేసి, విజయాలు సాధించాలని పిలుపు ఇచ్చారు. ఓటర్ల జాబితాపై కూడా నిఘా పెట్టాలని సలహా ఇచ్చారు. కార్యకర్తలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

స్థానిక పరిపాలన లేక గ్రామాల్లో మంచినీరు కూడా దొరకడం లేదని, అంటురోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడు లేని దుస్థితి నెలకొన్నదని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. సకాలంలో ఎన్నికలు జరిగి ఉంటే ఇలాంటి సమస్యలపై అధికారులను ప్రజా ప్రతినిధులే నిలదీసి ఉండేవారని అన్నారు. ప్రజా ప్రతినిధులైతే ప్రజలకు జవాబుదారీగా ఉంటారని అన్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో పెత్తనాన్ని చేతిలో పెట్టుకున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోని ఈ ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేసి బాధిస్తోందని దుయ్యబట్టారు.

స్థానిక ఎన్నికలను 2001 జనాభా లెక్కల జాబితా ప్రకారం అని కొంతకాలం, 2011 లెక్కల ప్రకారం నిర్వహిస్తామని మరి కొంత కాలం చెబుతూ ఈ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఆలస్యం చేస్తోందని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. అసలు స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు. రాజ్యాంగం చెప్పిన ప్రకారం పంచాయతీలకు అధికారాలు ఇవ్వడంలేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడంలేదని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు.

బి.సి. జనాభా దామాషా ప్రకారం స్థానాలను ఎంపిక చేసి వాటిలో అన్ని పార్టీలూ బిసి అభ్యర్థులనే ఎన్నికల బరిలో పెడదామని జగన్‌బాబు 2011లోనే ప్రతిపాదించారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. ఈ విధానంలో ఆ స్థానాల్లో బిసి అభ్యర్థులే ఎన్నికవుతారని ఆయన ప్రతిపాదించారన్నారు. అయితే, శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు ఇతర పార్టీలేవీ స్పందించని వైనాన్ని ఆమె గుర్తుచేశారు. స్థానిక సంస్థలకు రెండేళ్ళుగా ఎన్నికలు జరగనందున కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.4 వేల కోట్లు నిలిచిపోయాయని ఆమె విచారం వ్యక్తంచేశారు. బి.ఆర్.సి.ఎఫ్. నిధులు రూ. 350 కోట్లు మురిగిపోయాయన్నారు. 2013 - 14 ఎన్నికలకు సంబంధించి కేంద్ర నుంచి రావాల్సిన రూ. 2,400 కోట్లు నిలిచిపోయిన పరిస్థితి ఉందన్నారు.

స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు అదికారంలో ఉన్నప్పుడు తన 'మనసులో మాట' పుస్తకంలో రాసుకున్నారని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ళ పరిపాలనా కాలంలో రూ. 2,000 కోట్లను పక్కకు మళ్ళించారని తెలిపారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయించారని పేర్కొన్నారు. పంచాయతీలకు ఆయన అన్నీ సమకూర్చారన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ గౌరవ వేతనాలను వైయస్‌ కల్పించారన్నారు. వారిని ప్రోటోకాల్‌లో పెట్టారని, చెక్‌ పవర్‌ కూడా కల్పించారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అవన్నీ చతికిలబడ్డాయన్నారు.

గ్రామాల్లో కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, కానీ ఆ బిల్లులు పంచాయతీలే కట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిందని శ్రీమతి విజయమ్మ వెల్లడించారు. కరెంటు కోతలు, బిల్లుల మోత కారణంగా పల్లెలు చతికిలపడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అధికారపక్షం నాయకుల జేబులను నింపడం కోసం గ్రామ సభల ఆమోదం లేకుండా నామినేషన్‌ పద్ధతిలో పనులను ఈ ప్రభుత్వం కేటాయిస్తోందని దుయ్యబట్టారు. పంచాయతీ కార్యాలయాలు అశాంతి నిలయాలుగా మారిపోయాయని విచారం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు,  గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లన్నింటికీ కలిపి మొత్తం సుమారు రెండున్నర లక్షల మంది బి.సి.లు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు పదవులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

సార్వత్రిక ఎన్నికలు వస్తుండడం వల్ల, కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయినందున ఈ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నదే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి కాదని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఏ ఎన్నికల్లోనైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా అభ్యర్థులకు అండదండగా ఉండాలని పిలుపునిచ్చారు. కో ఆపరేటివ్‌ ఎన్నికల మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడి ఆధిపత్యం సాధించాలని సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం, రాజశేఖరరెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. పోలీసులకు అధికార కాంగ్రెస్‌ పార్టీ వినియోగిస్తుందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ పార్టీలు పెట్టే ప్రలోభాలకు లొంగవద్దని అన్నారు. పంచాయతీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

మన సత్తా చూపించి, ప్రతి పంచాయతీ కార్యాలయంపైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. పార్టీ గెలుపుపై అతి విశ్వాసం వద్దని, అలసత్వం ప్రదర్శించవద్దని, అప్రమత్తత అవసరమని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ఐకమత్యంగా కృషిచేయాలని కోరారు. టిక్కెట్ల విషయంలో సర్దుబాటు చేసుకుని అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలని ఉద్బోధించారు. నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ పోలింగ్‌ కేంద్రాలను విడిచిపెట్ట వద్దని నిర్దేశించారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల విషయం గందరగోళం నెలకొనే అవకాశం ఉన్నదని, అవసరమైతే కోర్టుకైనా వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. పార్టీలో అందరికీ తాను కూడా అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.

తెలంగాణ వెనుకబాటు వైయస్‌ రాజశేఖరరెడ్డి గుర్తించారని, అందుకే ఈ ప్రాంతం అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజల మీద ఒక్క రూపాయి కూడా పన్నుల భారం వేయలేదన్నారు. మహానేత వైయస్‌ పథకాల ఫలాలు ప్రజలకు అందాయన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో సువర్ణయుగం నడిచిందన్నారు. చంద్రబాబు నాయుడి కాలంలో ప్రజలను కాల్చుకు తిన్నారన్నారు. తన తొమ్మిదేళ్ళ పాలనలో 8 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారని, కిరణ్‌కుమార్‌ నాలుగేళ్ళలో నాలుగుసార్లు పెంచారని విమర్శించారు. కేంద్రం నుంచి కిరణ్‌ ఎలాంటి సాయాన్నీ తీసుకురావడంలేదని దుయ్యబట్టారు. ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ఆర్టీసి చార్జీలు మూడుసార్లు పెంచిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్నో ఆంక్షలు విధించారని తెలిపారు.

అమ్మ హస్తం పథకంలో నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారని, 9 వస్తువులు ఇస్తామని ప్రకటనలు చేసిన కిరణ్‌ ప్రభుత్వం కొన్నింటినే ఇస్తోందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. రూపాయికే కిలో బియ్యం అని చెప్పి, పేదలకు ఇచ్చే బియ్యంపై పరిమితి పెట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని దుయ్యబట్టారు. కుమ్మక్కై కుళ్ళు రాజకీయాలు చేయడమే కాక ప్రజల సమస్యల గురించి పట్టించుకోని కాంగ్రెస్‌, టిడిపిలకు ఓట్లు ఎందుకు వేయాలని ఆమె నిలదీశారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top